హెచ్‌పీసీఎల్‌ లాభం క్షీణత | HPCL net profit plunges 80percent to Rs 172 crore in Q3 | Sakshi
Sakshi News home page

హెచ్‌పీసీఎల్‌ లాభం క్షీణత

Feb 10 2023 6:09 AM | Updated on Feb 10 2023 6:09 AM

HPCL net profit plunges 80percent to Rs 172 crore in Q3  - Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(హెచ్‌పీసీఎల్‌) ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం భారీగా క్షీణించి రూ. 172 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 869 కోట్లు ఆర్జించింది. అయితే అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్‌ ధరలను సవరించకపోవడంతో వరుసగా రెండు త్రైమాసికాలలో నష్టాలు నమోదైనట్లు కంపెనీ పేర్కొంది. కాగా..  చమురు ధరలు క్షీణించడంతో తిరిగి మూడో క్వార్టర్‌లో నష్టాలను పూడ్చుకునేందుకు వీలు చిక్కినట్లు తెలియజేసింది.

ప్రస్తుత సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం రూ. 1.03 లక్షల కోట్ల నుంచి రూ. 1.15 లక్షల కోట్లకు ఎగసింది. ఈ కాలంలో ఒక క్వార్టర్‌కు కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 4.83 మిలియన్‌ టన్నుల(ఎంటీ) ముడిచమురును ప్రాసెస్‌ చేసింది. గత క్యూ3లో ఇది 4.24 ఎంటీగా నమోదైంది. అమ్మకాల పరిమాణం 7 శాతం పుంజుకుని 11.25 ఎంటీకి చేరింది. ఒక్కో బ్యారల్‌ చమురుపై స్థూల రిఫైనింగ్‌ మార్జిన్లు 11.4 డాలర్లకు ఎగశాయి. గత క్యూ3లో ఇవి 4.5 డాలర్లు మాత్రమే. విశాఖ రిఫైనరీ నవీకరణ ప్రాజెక్టు చివరి దశకు చేరుకున్నట్లు కంపెనీ పేర్కొంది. దీనిలో భాగంగా 8.3 ఎంటీ రిఫైనింగ్‌ సామర్థ్యాన్ని 15 ఎంటీకి విస్తరిస్తున్న విషయం విదితమే. 5 ఎంటీ ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌ సైతం పూర్తికావస్తున్నట్లు తెలియజేసింది.  

ఫలితాల నేపథ్యంలో హెచ్‌పీసీఎల్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో యథాతథంగా రూ. 232 వద్ద ముగిసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement