రాబడులు, రక్షణ ఒకే పథకంలో.. | HDFC Hybrid Equity Fund Review | Sakshi
Sakshi News home page

రాబడులు, రక్షణ ఒకే పథకంలో..

Sep 6 2021 8:01 AM | Updated on Sep 6 2021 8:25 AM

HDFC Hybrid Equity Fund Review - Sakshi

రిస్క్‌, రాబడుల మధ్య సమతుల్యం కోసం పెట్టుబడులను వివిధ సాధనాల మధ్య (ఈక్విటీ, డెట్, ఇతర) వర్గీకరించుకోవాలన్నది ఆర్థిక సూత్రాల్లో భాగం. ఉదాహరణకు ఈక్విటీలు అధిక రాబడులకు మార్గం. కానీ, వీటిల్లో స్వల్ప కాలానికి అధిక రిస్క్‌ ఉంటుంది. డెట్‌ పథకాల్లో రిస్క్‌ తక్కువ. రాబడులు కూడా మోస్తరుగానే ఉంటాయి. హెచ్‌డీఎఫ్‌సీ హైబ్రిడ్‌ ఈక్విటీ ఫండ్‌ అన్నది ఈక్విటీ, డెట్‌ రెండింటిలోనూ పెట్టుబడులు చేయాలని కోరుకునే వారికి అనుకూలమైనది. ఈ విభాగంలోని అగ్రగామి పథకాల్లో ఇది కూడా ఒకటి.  
రాబడులు 
గడిచిన ఏడాది కాలంలో ఈ పథకం 45 శాతం రాబడులను ఇచ్చింది. మూడేళ్లలో 13.47 శాతం, ఐదేళ్లలో 12.86 శాతం, ఏడేళ్లలో 12.72 శాతం, పదేళ్లలో 14.92 శాతం చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌ విభాగం సగటు రాబడులతో పోల్చి చూస్తే ఒక శాతం వరకు ఈ పథకమే మెరుగైన రాబడులను అన్ని కాలాల్లోనూ ఇచ్చింది. 2000 సెప్టెంబర్‌ 11న ఈ పథకం మొదలు కాగా.. నాటి నుంచి చూసుకున్నా కానీ వార్షిక రాబడులు 16 శాతంగా ఉన్నాయి.  
పెట్టుబడుల విధానం 
ఈ పథకం ఈక్విటీల్లో కనిష్టంగా 65 శాతం, గరిష్టంగా 80 శాతం వరకు, డెట్‌లో 20–35 శాతం మధ్య ఇన్వెస్ట్‌ చేస్తుంది. కనుక ఈక్విటీ ర్యాలీల్లో మెరుగైన రాబడులు ఒడిసి పట్టుకునేందుకు.. అదే సమయంలో ఈక్విటీ మార్కెట్ల పతనాల్లో నష్టాలను పరిమితం చేసుకునేందుకు ఈ పథకంలో అవకాశం ఉంటుంది. రెండు దశాబ్దాల చరిత్ర కలిగి ఉండడంతో దీర్ఘకాల లక్ష్యాల కోసం ఈ పథకాన్ని పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవడాన్ని పరిశీలించొచ్చు. డెట్‌ కంటే ఎక్కువ రాబడులు సమకూర్చుకోవడం, ఈక్విటీలతో పోలిస్తే తక్కువ రిస్క్‌ ఉండేలా చూడడం ఈ పథకం పనితీరులో భాగం. ఈక్విటీ విషయానికొస్తే స్మాల్, మిడ్, లార్జ్‌క్యాప్‌ వ్యాప్తంగా ఇన్వెస్ట్‌ చేసే స్వేచ్ఛను కలిగి ఉంది. 65 శాతం పెట్టుబడులు ఈక్విటీల్లో ఉంటే ఆదాయపన్ను చట్టం కింద.. ఈక్విటీ పన్ను ప్రయోజనాలకు అర్హత లభిస్తుంది. 2020 మార్చి ఈక్విటీల పతనం నాటికి ఈ పథకంలో ఈక్విటీలకు కేటాయింపులు 64.9 శాతం ఉండగా.. ఆ తర్వాతి నుంచి 2020 డిసెంబ ర్‌ నాటికి 75 శాతానికి పెంచుకుంది. ప్రస్తుతం ఈక్విటీల్లో పెట్టుబడులు 72.4 శాతం మేర ఉంటే, డెట్‌లో 19 శాతం, మిగిలిన మేర నగదు నిల్వలు కలిగి ఉంది. ఇటీవలి కాలంలో ఈక్విటీలు గణనీయమైన ర్యాలీ చేయడం తెలిసిందే. కనుక కరెక్షన్‌ చో టుచేసుకుంటే ఈక్విటీలకు కేటాయింపులను పెం చేందుకు ఈ పథకం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.18,394 కోట్ల ఆస్తులున్నాయి. పోర్ట్‌ఫోలియోలో 38 స్టాక్స్‌ను కలిగి ఉంది. బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 26 శాతం పెట్టుబడులను ఈ రంగాల స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేసింది. ఆ తర్వాత ఇంధన రంగ కంపెనీలకు 8.26 శాతం, టెక్నాలజీ కంపెనీలకు 7.28 శాతం, నిర్మాణ రంగ కంపెనీలకు 6.45 శాతం చొప్పున కేటాయింపులు చేసింది. 

              ఈక్విటీ టాప్‌ హోల్డింగ్స్‌ 
కంపెనీ                                  పెట్టుబడుల శాతం 
ఐసీఐసీఐ బ్యాంకు                          7.46 
ఇన్ఫోసిస్‌                                       5.69 
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు                    5.43 
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌                   4.20 
ఎల్‌అండ్‌టీ                                  4.15 
హెచ్‌డీఎఫ్‌సీ                                 4.11 
ఎస్‌బీఐ                                         3.66 
భారత్‌ ఎలక్ట్రానిక్స్‌                        3.32 
ఐటీసీ                                           2.98 
యాక్సిస్‌ బ్యాంకు                         2.89

చదవండి : లాభాల స్వీకరణకు అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement