హెచ్‌సీఎల్‌ టెక్‌ లాభం 2,962 కోట్లు

HCL Technologies Q4 net profit down 6percent - Sakshi

క్యూ4లో 19 భారీ డీల్స్‌; విలువ 3.1 బిలియన్‌ డాలర్లు

ప్రత్యేక డివిడెండ్‌ సహా షేరుకి రూ. 16 చెల్లింపు

గతేడాది 10 బిలియన్‌ డాలర్లను దాటిన ఆదాయం

న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ గత ఆర్థిక సంవత్సరం(2020–21) చివరి త్రైమాసికంలో రూ. 2,962 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఇది 6 శాతం తక్కువకాగా.. అంతక్రితం ఏడాది క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 3,154 కోట్లు ఆర్జించింది. యూఎస్‌ అకౌంటింగ్‌ ప్రమాణాల ప్రకారం ఆదాయం దాదాపు 6 శాతం పుంజుకుని 19,642 కోట్లను తాకింది. ఇక డాలర్ల రూపేణా నికర లాభం 5 శాతం క్షీణించి 41 కోట్ల డాలర్లకు పరిమితంకాగా.. ఆదాయం 6 శాతం పెరిగి 270 కోట్ల డాలర్లకు చేరింది.  

రికార్డ్‌: మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి హెచ్‌సీఎల్‌ టెక్‌ నికర లాభం 17.6% పుంజుకుని రూ. 13,011 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 6.7 శాతం బలపడి రూ. 75,379 కోట్లకు చేరింది. డాలర్ల రూపేణా నికర లాభం 13% పెరిగి 176 కోట్ల డాలర్లను తాకగా.. ఆదాయం 1,017.5 కోట్ల డాలర్లకు చేరింది. వాటాదారులకు షేరుకి రూ. 6 డివిడెండును ప్రకటించింది. దీనికి జతగా.. ఆదాయం తొలిసారి 10 బిలియన్‌ డాలర్ల మైలురాయిని అధిగమించడంతో మరో రూ. 10ను ప్రత్యేక మధ్యంతర డివిడెండుగా ప్రకటించింది. వెరసి వాటాదారులకు షేరుకి రూ. 16 చొప్పున చెల్లించనుంది. దీంతో గతేడాదికి మొత్తం రూ. 26 డివిడెండ్‌ చెల్లించినట్లయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)లో ఆదాయం రెండంకెల వృద్ధిని సాధించే వీలున్నట్లు కంపెనీ అంచనా వేస్తోంది.

షేరు ఫ్లాట్‌: మార్కెట్లు ముగిశాక హెచ్‌సీఎల్‌ టెక్‌ ఫలితాలు విడుదల చేసింది. ఎన్‌ఎస్‌ఈలో షేరు 0.6% నీరసించి రూ. 957 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ.975–950 మధ్య ఊగిసలాడింది.  
త్రైమాసిక ప్రాతిపదికన క్యూ4లో ఆదాయం 2.5 శాతం పుంజుకుంది. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 3.1 బిలియన్‌ డాలర్ల విలువైన డీల్స్‌ లభించాయి. విభిన్న విభాగాల నుంచి మొత్తం 19 భారీ డీల్స్‌ను కుదుర్చుకున్నాం. తద్వారా కొత్త ఏడాదిలోకి ఉత్సాహంగా అడుగుపెట్టాం.
–  సి.విజయ్‌కుమార్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, ప్రెసిడెంట్, సీఈవో

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top