
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు దన్ను
100 రోజుల సంస్కరణ అజెండా
న్యూఢిల్లీ: స్టార్టప్‌లకు పన్ను సంబంధ లబ్దిని పెంచడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ) మార్గదర్శకాలను మరింత సరళీకరించడం, పొరుగు దేశాల నుంచి పెట్టుబడులను ప్రోత్సహించడం తదితర అంశాలతో వాణిజ్యం, పరిశ్రమల శాఖ 100 రోజుల సంస్కరణల అజెండాకు తెరతీయనుంది. అంతేకాకుండా లెదర్, ఫుట్‌వేర్ పరిశ్రమకు మద్దతుగా కొన్ని పర్యావరణ నిబంధనలను సులభతరం చేయడం, ఈకామర్స్ కేంద్రాల ద్వారా ఎగుమతుల పెంపునకు నిబంధనలను సరళీకరించడం, వివిధ రంగాలకు అవసరమయ్యే ల్యాబ్ టెస్టింగ్, సర్టిఫికేషన్‌లను ఏకీకృతం చేయడం సైతం సంస్కరణలలో భాగంకానున్నట్లు వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు.
తదుపరి 100 రోజుల ట్రాన్స్‌ఫార్మేషన్ అజెండాలో భాగంగా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించేందుకు వేగవంత చర్యలకు తెరతీయనున్నట్లు తెలియజేశారు. తాజా ప్రతిపాదనలు దేశ ఎగుమతులతోపాటు.. ఎఫ్‌డీఐలకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు తెలియజేశారు. కాగా. 2025–26 ఏప్రిల్– జూలైలో ఎగుమతులు 3.07 శాతం పుంజుకుని 149.2 బిలియన్ డాలర్లను తాకగా.. దిగుమతులు మరింత అధికంగా 5.4 శాతం పెరిగి 244 బిలియన్ డాలర్లను దాటాయి. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలల్లో వాణిజ్య లోటు 94.81 బిలియన్ డాలర్లకు చేరింది. గతేడాది(2024–25) ఎఫ్‌డీఐలు 13 శాతం ఎగసి 50 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.