కన్సల్టెంట్లకు డిమాండ్‌ | Gig economy surges 38percent in FY25 as firms tap project | Sakshi
Sakshi News home page

కన్సల్టెంట్లకు డిమాండ్‌

May 18 2025 6:21 AM | Updated on May 18 2025 6:21 AM

Gig economy surges 38percent in FY25 as firms tap project

2024–25లో 38 శాతం వృద్ధి 

ఫ్లెక్సింగ్‌ ఇట్‌ నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అనిశ్చితి, జాబ్‌ మార్కెట్లో అప్రమత్తత నెలకొన్నప్పటికీ తాత్కాలిక ప్రాతిపదికన సేవలందించే కన్సల్టెంట్లు, ఫ్రీలాన్సర్లకు డిమాండ్‌ గణనీయంగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో కన్సల్టెంట్లకు, ప్రాజెక్ట్‌లవారీగా సేవలందించే వారికి డిమాండ్‌ 38 శాతం పెరిగింది. అంతక్రితం రెండేళ్లు ఇది సగటున 17 శాతంగానే నమోదైంది. వైట్‌ కాలర్‌ గిగ్‌ సరీ్వసుల ప్లాట్‌ఫాం ‘ఫ్లెక్సింగ్‌ ఇట్‌’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

 సాధారణంగా సేవల రంగంలోనే ఫ్రీలాన్సర్లకు ప్రాధాన్యం ఉండేది. కానీ ప్రస్తుతం పారిశ్రామిక, తయారీ రంగాలు కూడా వారి సర్వీసులను పొందడంపై ఆసక్తి చూపుతున్నాయి. గిగ్‌ వర్కర్లను ఎక్కువగా తీసుకుంటున్న టాప్‌ –3 రంగాల్లో ఈ రెండూ కూడా వచ్చి చేరాయి. ఎఫ్‌ఎంసీజీ, కన్సల్టింగ్, బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా), హెల్త్‌కేర్‌ రంగాల్లో డిమాండ్‌ పటిష్టంగా కొనసాగుతుండగా.. కొత్తగా పరిశ్రమలు, తయారీ రంగాలు కూడా  వారి సేవలను వినియోగించుకోవడానికి ముందుకు వస్తుండటం సానుకూలాంశమని ఫ్లెక్సింగ్‌ ఇట్‌ పేర్కొంది.  

మారుతున్న హైరింగ్‌ తీరు .. 
కొత్త టెక్నాలజీలు, మారిపోతున్న మార్కెట్‌ పరిస్థితులకు వ్యాపార సంస్థలు తమను తాము మల్చుకునే క్రమంలో నియామకాలపరమైన అవసరాలు మారుతున్నాయి. పరిస్థితిని బట్టి అప్పటికప్పుడు నిపుణులను నియమించుకోవడమనేది ప్రత్యర్థి సంస్థలతో పోటీపడటంలో ముందుండేందుకు ఉపయోగపడుతోంది. పలు కంపెనీలు తమ రిక్రూట్‌మెంట్‌ విధానాల్లో మార్పులు, చేర్పులు చేస్తున్నాయని ఫ్లెక్సింగ్‌ ఇట్‌ పేర్కొంది. పెద్ద ఎత్తున ఫ్రీలాన్సర్ల సేవలు తీసుకుంటున్నాయని వివరించింది. స్పెషలిస్ట్‌ నైపుణ్యాలున్న వారు అందుబాటులో ఉండటం, వేగవంతంగా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వెసులుబాటు లభిస్తుండటమనేది ఇందుకు దోహదపడుతోందని పేర్కొంది. ఫ్లెక్సింగ్‌ ఇట్‌ ప్లాట్‌ఫాంలో వివిధ నైపుణ్యాలున్న 1,00,000 మంది పైగా కన్సల్టెంట్లు అందుబాటులో ఉన్నారు. 

రిమోట్‌ వర్కింగ్‌ వైపు మొగ్గు.. 
ఉద్యోగులను ఆఫీసులకు రప్పించాలా లేదా ఇంటి నుంచే పని చేసే విధానాన్ని కొనసాగించాలా అనే అంశాలపై కంపెనీలు ఇంకా డైలమాలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ.. ఫ్రీలాన్సింగ్‌ విషయంలో రిమోట్‌ వర్కింగ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటోంది. ప్రతి నాలుగు ప్రాజెక్టుల్లో ఒకటి పూర్తిగా రిమోట్‌ ప్రాజెక్టుగా ఉంటోంది. స్ట్రాటెజీ, టెక్నాలజీ, మార్కెటింగ్‌ విభాగాల్లో పట్టున్న భారతీయ కన్సల్టెంట్లు ఎక్కువగా గ్లోబల్‌ క్లయింట్లకు సరీ్వసులు అందిస్తున్నారు. ఇలాంటి ప్రాజెక్టుల విషయంలో ఎక్కడి నుంచి పనిచేస్తున్నారు అనే దానికన్నా నైపుణ్యాలే కీలకంగా ఉంటుండటంతో రిమోట్‌ వర్కింగ్‌కి ప్రాధాన్యత ఉంటోంది.  

టెక్నాలజీలో అత్యధికం 
ఫ్రీలాన్సర్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉన్న రంగాల్లో వరుసగా మూడో ఏడాది టెక్నాలజీ విభాగం (25 శాతం) అగ్రస్థానంలో నిల్చింది. కృత్రిమ మేథ వినియోగం, డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం, డిజిటల్‌ పరివర్తన ధోరణి పెరుగుతుండటం ఇందుకు కారణం. ఇక స్ట్రాటెజీ..బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (15 శాతం) రెండో స్థానంలో, ఫైనాన్స్‌ (11 శాతం) మూడో స్థానంలో ఉన్నాయి. ఫ్రీలాన్సింగ్‌ అనేది కేవలం ప్రత్యేక నైపుణ్యాలు, టెక్నాలజీకి మాత్రమే పరిమితం కావడం లేదని, ఇతరత్రా విభాగాల్లోనూ పెరుగుతోందనేందుకు ఇది నిదర్శనమని ఫ్లెక్సింగ్‌ ఇట్‌ తెలిపింది. మరోవైపు, ఫ్రీలాన్సర్ల లభ్యత కూడా గణనీయంగా పెరుగుతోంది.

 గత రెండేళ్లలో కన్సల్టెంట్ల రిజిస్ట్రేషన్లు 127 శాతం పెరిగాయి. వీరిలో 59 శాతం మందికి పదేళ్ల లోపు అనుభవమే ఉంది. సంప్రదాయ పద్ధతిలో ఒక్కో మెట్టు ఎదుగుతూ పైకెళ్లడం కన్నా స్వతంత్రతను, రకరకాల ప్రాజెక్టులు చేయడం ద్వారా అనుభవాన్ని గడించేందుకు ప్రొఫెషనల్స్‌ ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ ధోరణికి మిలీనియల్స్‌ శ్రీకారం చుట్టగా, జెన్‌ జడ్‌ తరం దాన్ని వేగంగా అందిపుచ్చుకుంటోంది. గతంలో మధ్య స్థాయి, సీనియర్‌ ప్రొఫెషనల్స్‌ ఇలా ఫ్రీలాన్సింగ్‌ బాట పట్టే వారు. కానీ టెక్నాలజీ, మార్కెటింగ్, ఫైనాన్స్‌లాంటి రంగాల్లో నైపుణ్యాలున్న యువత ఫ్రీలాన్సింగ్‌ వైపు మొగ్గు చూపే ధోరణి పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరం కన్సల్టెంట్లుగా కొత్తగా రిజిస్టర్‌ చేసుకున్నవారిలో 38 శాతం మంది మహిళలు ఉన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement