breaking news
Consultant agencies
-
కన్సల్టెంట్లకు డిమాండ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అనిశ్చితి, జాబ్ మార్కెట్లో అప్రమత్తత నెలకొన్నప్పటికీ తాత్కాలిక ప్రాతిపదికన సేవలందించే కన్సల్టెంట్లు, ఫ్రీలాన్సర్లకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో కన్సల్టెంట్లకు, ప్రాజెక్ట్‌లవారీగా సేవలందించే వారికి డిమాండ్ 38 శాతం పెరిగింది. అంతక్రితం రెండేళ్లు ఇది సగటున 17 శాతంగానే నమోదైంది. వైట్ కాలర్ గిగ్ సరీ్వసుల ప్లాట్‌ఫాం ‘ఫ్లెక్సింగ్ ఇట్’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. సాధారణంగా సేవల రంగంలోనే ఫ్రీలాన్సర్లకు ప్రాధాన్యం ఉండేది. కానీ ప్రస్తుతం పారిశ్రామిక, తయారీ రంగాలు కూడా వారి సర్వీసులను పొందడంపై ఆసక్తి చూపుతున్నాయి. గిగ్ వర్కర్లను ఎక్కువగా తీసుకుంటున్న టాప్ –3 రంగాల్లో ఈ రెండూ కూడా వచ్చి చేరాయి. ఎఫ్ఎంసీజీ, కన్సల్టింగ్, బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా), హెల్త్‌కేర్ రంగాల్లో డిమాండ్ పటిష్టంగా కొనసాగుతుండగా.. కొత్తగా పరిశ్రమలు, తయారీ రంగాలు కూడా వారి సేవలను వినియోగించుకోవడానికి ముందుకు వస్తుండటం సానుకూలాంశమని ఫ్లెక్సింగ్ ఇట్ పేర్కొంది. మారుతున్న హైరింగ్ తీరు .. కొత్త టెక్నాలజీలు, మారిపోతున్న మార్కెట్ పరిస్థితులకు వ్యాపార సంస్థలు తమను తాము మల్చుకునే క్రమంలో నియామకాలపరమైన అవసరాలు మారుతున్నాయి. పరిస్థితిని బట్టి అప్పటికప్పుడు నిపుణులను నియమించుకోవడమనేది ప్రత్యర్థి సంస్థలతో పోటీపడటంలో ముందుండేందుకు ఉపయోగపడుతోంది. పలు కంపెనీలు తమ రిక్రూట్మెంట్ విధానాల్లో మార్పులు, చేర్పులు చేస్తున్నాయని ఫ్లెక్సింగ్ ఇట్ పేర్కొంది. పెద్ద ఎత్తున ఫ్రీలాన్సర్ల సేవలు తీసుకుంటున్నాయని వివరించింది. స్పెషలిస్ట్ నైపుణ్యాలున్న వారు అందుబాటులో ఉండటం, వేగవంతంగా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వెసులుబాటు లభిస్తుండటమనేది ఇందుకు దోహదపడుతోందని పేర్కొంది. ఫ్లెక్సింగ్ ఇట్ ప్లాట్‌ఫాంలో వివిధ నైపుణ్యాలున్న 1,00,000 మంది పైగా కన్సల్టెంట్లు అందుబాటులో ఉన్నారు. రిమోట్ వర్కింగ్ వైపు మొగ్గు.. ఉద్యోగులను ఆఫీసులకు రప్పించాలా లేదా ఇంటి నుంచే పని చేసే విధానాన్ని కొనసాగించాలా అనే అంశాలపై కంపెనీలు ఇంకా డైలమాలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ.. ఫ్రీలాన్సింగ్ విషయంలో రిమోట్ వర్కింగ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటోంది. ప్రతి నాలుగు ప్రాజెక్టుల్లో ఒకటి పూర్తిగా రిమోట్ ప్రాజెక్టుగా ఉంటోంది. స్ట్రాటెజీ, టెక్నాలజీ, మార్కెటింగ్ విభాగాల్లో పట్టున్న భారతీయ కన్సల్టెంట్లు ఎక్కువగా గ్లోబల్ క్లయింట్లకు సరీ్వసులు అందిస్తున్నారు. ఇలాంటి ప్రాజెక్టుల విషయంలో ఎక్కడి నుంచి పనిచేస్తున్నారు అనే దానికన్నా నైపుణ్యాలే కీలకంగా ఉంటుండటంతో రిమోట్ వర్కింగ్‌కి ప్రాధాన్యత ఉంటోంది. టెక్నాలజీలో అత్యధికం ఫ్రీలాన్సర్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్న రంగాల్లో వరుసగా మూడో ఏడాది టెక్నాలజీ విభాగం (25 శాతం) అగ్రస్థానంలో నిల్చింది. కృత్రిమ మేథ వినియోగం, డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం, డిజిటల్ పరివర్తన ధోరణి పెరుగుతుండటం ఇందుకు కారణం. ఇక స్ట్రాటెజీ..బిజినెస్ డెవలప్మెంట్ (15 శాతం) రెండో స్థానంలో, ఫైనాన్స్ (11 శాతం) మూడో స్థానంలో ఉన్నాయి. ఫ్రీలాన్సింగ్ అనేది కేవలం ప్రత్యేక నైపుణ్యాలు, టెక్నాలజీకి మాత్రమే పరిమితం కావడం లేదని, ఇతరత్రా విభాగాల్లోనూ పెరుగుతోందనేందుకు ఇది నిదర్శనమని ఫ్లెక్సింగ్ ఇట్ తెలిపింది. మరోవైపు, ఫ్రీలాన్సర్ల లభ్యత కూడా గణనీయంగా పెరుగుతోంది. గత రెండేళ్లలో కన్సల్టెంట్ల రిజిస్ట్రేషన్లు 127 శాతం పెరిగాయి. వీరిలో 59 శాతం మందికి పదేళ్ల లోపు అనుభవమే ఉంది. సంప్రదాయ పద్ధతిలో ఒక్కో మెట్టు ఎదుగుతూ పైకెళ్లడం కన్నా స్వతంత్రతను, రకరకాల ప్రాజెక్టులు చేయడం ద్వారా అనుభవాన్ని గడించేందుకు ప్రొఫెషనల్స్ ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ ధోరణికి మిలీనియల్స్ శ్రీకారం చుట్టగా, జెన్ జడ్ తరం దాన్ని వేగంగా అందిపుచ్చుకుంటోంది. గతంలో మధ్య స్థాయి, సీనియర్ ప్రొఫెషనల్స్ ఇలా ఫ్రీలాన్సింగ్ బాట పట్టే వారు. కానీ టెక్నాలజీ, మార్కెటింగ్, ఫైనాన్స్‌లాంటి రంగాల్లో నైపుణ్యాలున్న యువత ఫ్రీలాన్సింగ్ వైపు మొగ్గు చూపే ధోరణి పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరం కన్సల్టెంట్లుగా కొత్తగా రిజిస్టర్ చేసుకున్నవారిలో 38 శాతం మంది మహిళలు ఉన్నారు. -
ఏజెన్సీలకు రూ. కోట్ల నామినేషన్లు
=జీహెచ్ఎంసీ తీరుపై సభ్యుల మండిపాటు =ఈ అంశంపైనే గంటసేపు దుమారం సాక్షి, సిటీబ్యూరో : దాదాపు రూ. 20 వేల విలువైన క్యాచ్‌పిట్ పనులకు సైతం టెండర్లు పిలిచే జీహెచ్ఎంసీ అధికారులు.. లక్షలు, కోట్ల రూపాయల పనుల్ని కన్సల్టెంట్ ఏజెన్సీలకు నామినేషన్లపై కట్టబెట్టడంపై సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ యాక్ట్‌లో లేకున్నా లక్షలాది రూపాయలు నామినేషన్లపై ఎలా ఇస్తున్నారంటూ వెల్లువెత్తిన ప్రశ్నలతో సమాధానం చెప్పలేని అధికారులు నీళ్లు నమిలారు. లక్షలాది రూపాయలు ఫీజులుగా తీసుకుంటున్న కన్సల్టెంట్లు భవిష్యత్తులో జీహెచ్ఎంసీని శాసించేలా ఉన్నార ని మండిపడ్డారు. లక్షల రూపాయల ఫీజులు గుంజుతున్నా వారిచ్చే నివేదికలు తప్పుల తడకలని దుయ్యబడుతూ, వందగజాల స్థలంలో ఇంటి విస్తీర్ణం 10వేల చదరపు అడుగులంటూ ఒక ఏజెన్సీ నివేదిక ఇవ్వడాన్ని ప్రస్తావించారు. గూగుల్‌మ్యాప్ ద్వారా ఆ వివరాలనడంతో.. తిరిగి మన అధికారులే సర్వే చేయాల్సి వచ్చిందన్నారు. మన వద్ద నిపుణులైన ఇంజినీర్లు లేరా.. ? ఎందుకు వారికి కట్టబెడుతున్నారని నిలదీశారు. కాంగ్రెస్ సభ్యుడు మహేశ్‌యాదవ్ ఈ అంశాన్ని లేవనెత్తగా కాంగ్రెస్ పక్ష నాయకుడు దిడ్డి రాంబాబు, జుల్ఫీక ర్ అలీ(ఎంఐఎం), జితేందర్(బీజేపీ), నజీరుద్దీన్(ఎంఐఎం) తదితరులు అధికారుల తీరును తూర్పారబట్టారు. వైఎస్సార్ కౌన్సిల్‌హాల్ డిజైన్ కోసం ఇప్పటికి మూడు ఏజెన్సీలకు రూ. 25 లక్షలు ఖర్చు చేశారని, శంకుస్థాపన తప్ప పని మాత్రం ప్రారంభం కాలేద న్నారు. చివరకు రోడ్లు, తదితర పనులను సైతం కన్సల్టెంట్స్‌కు ఇస్తున్నారంటూ.. మన ఇంజినీర్లు చేస్తున్న పనేమిటని ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఈఎన్సీ ధన్సింగ్ మాట్లాడుతూ.. ఆర్అండ్బీ, హెచ్ఎండీఏ వంటి సంస్థలు కూడా ఏజన్సీలకిస్తున్నాయన్నారు. వాటికి పాలకమండలి, చట్టం అనేవి లేవని, స్టాండింగ్ కమిటీ, జనరల్‌బాడీ ఆమోదం లేకుండా పనులెలా కట్టబెడతారని జుల్ఫీకర్అలీ ప్రశ్నించారు. రూ. 8 కోట్లకు పైగా ఏజెన్సీలకు కట్టబెట్టడాన్ని తప్పుబట్టారు. కమిషనర్ సోమేశ్‌కుమార్ స్పందిస్తూ.. జీహెచ్ఎంసీలో తగినంతమంది ఇంజినీర్లు లేనందున ఉన్నవారికి నిర్వహణ పనులతోనే సరిపోతోందన్నారు. ఆర్ఓబీ, ఆర్యూబీల వంటి ప్రత్యేక పనులకు నిపుణులు లేనందున కన్సల్టెంట్ల సేవలు తీసుకుంటున్నారన్నారు. ఆయా అంశాల్లో నిపుణులైన ఇంజనీర్లను జీహెచ్ఎంసీలో నియమించాల్సి ఉందన్నారు. అన్ని అంశాలపై 15 రోజుల్లోగా తగిన నివేదిక సమర్పిస్తామని హామీ ఇచ్చారు. వీటికి సంబంధించి సమగ్ర నివేదికను తదుపరి స్టాండింగ్ కమిటీ ముందుంచాల్సిందిగా మేయర్ ఆదేశించారు. ప్రైవేటు కన్సల్టెంట్ ఏజెన్సీల అవసరం.. ఇంతవరకు వాటికిచ్చిన ప్రాజెక్టుల పనులు.. చేసిన వ్యయం తదితర అంశాలపై నివేదిక నివ్వాల్సిందిగా తీర్మానం చేశారు. అలాగే అక్రమంగా వెలసిన ప్లాస్టిక్ ఉత్పత్తి సంస్థలపై, జంతువుల కొవ్వు, కళేబరాల నుంచి నూనె తీస్తున్నవారిపై కఠినచర్యలకు సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అంతకుముందు మాదాపూర్ సాయినగర్‌లో సివరేజి పనులు ఎంతోకాలంగా పూర్తికాకపోవడంపై కాంగ్రెస్ సభ్యుడు జగదీశ్వర్‌గౌడ్, కల్తీనూనెలు వినియోగిస్తున్న హోటళ్లపై చర్యలు లేకపోవడంపై బంగారిప్రకాశ్(బీజేపీ)లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.