ప్యాకెట్‌ సైజ్‌ పెంచి ధరలు తగ్గించి.. వృద్ధిపై ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమ ఆశలు

FMCG companies expect sustained recovery in volume and margins with price reduction in FY24 - Sakshi

సాధారణ పరిస్థితులతో సానుకూలత

మార్చి క్వార్టర్‌లో మెరుగుపడిన అమ్మకాలు

ప్రకటనలు, మార్కెటింగ్‌పై అధిక పెట్టుబడులు

న్యూఢిల్లీ: పరిస్థితులు తిరిగి గాడిన పడుతుండడంతో ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమ వృద్ధి పట్ల ఆశావహ అంచనాలతో ఉంది. ప్రకటనలు, మార్కెటింగ్‌పై వ్యయాలను పెంచడంతోపాటు, పెట్టుబడులను కూడా ఇతోధికం చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కొన్ని త్రైమాసికాల విరామం తర్వాత అవి తిరిగి అమ్మకాల్లో వృద్ధిని చూస్తున్నాయి. ద్రవ్యోల్బణం, ముడి సరకుల ధరలు తగ్గడం వాటికి అనుకూలిస్తోంది. దీంతో ప్యాకెట్లలో గ్రాములు పెంచడం, ధరల తగ్గింపు వంటి నిర్ణయాలతో వినియోగదారులను ఆకర్షించే చర్యలు తీసుకుంటున్నాయి.

మార్చి త్రైమాసికంలో ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీల పనితీరును పరిశీలిస్తే.. హిందుస్తాన్‌ యూనిలీవర్, డాబర్, మారికో, గోద్రేజ్‌ కన్జ్యూమర్, ఐటీసీ, టాటా కన్జ్యూమర్, నెస్లే అమ్మకాల్లో వృద్ధిని నమోదు చేశాయి. 2023–24లో ఎఫ్‌ఎంసీజీ వినియోగం క్రమంగా పుంజుకుంటుందన్న అంచనాను వ్యక్తం చేశాయి. ‘‘స్థిరమైన వృద్ధి అవకాశాలు బలపడ్డాయి. ఐదు త్రైమాసికాలుగా విక్రయాల్లో క్షీణత అనంతరం ఈ రంగం అమ్మకాల్లో వృద్ధిని చూసింది. పట్టణ వినియోగం స్థిరంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ క్షీణత ముగిసినట్టేనని సంకేతాలు కనిపిస్తున్నాయి’’అని మారికో ఎండీ, సీఈవో సౌగతగుప్తా తెలిపారు.

ముఖ్యంగా ఆహార ఉత్పత్తులు ఎఫ్‌ఎంసీజీ వృద్ధిని నడిపిస్తున్నాయని చెప్పుకోవాలి. హోమ్, పర్సనల్‌ కేర్‌ ఉత్పత్తుల అమ్మకాలు కూడా సానుకూల శ్రేణిలోకి వచ్చేశాయి. సఫోలా, పారాచ్యూట్‌ తదితర ప్రముఖ బాండ్లతో ఉత్పత్తులను విక్రయించే మారికో లాభం మార్చి త్రైమాసికంలో 19 శాతం పెరిగి రూ.305 కోట్లుగా ఉండడం గమనార్హం. అమ్మకాలు 4 శాతం పెరిగాయి.  

మందగమనం ముగిసినట్టే.. 
‘‘ఎఫ్‌ఎంసీజీ మార్కెట్లో మందగమనం ముగిసింది. అమ్మకాలతో మెరుగైన వాతావ రణం నెలకొంది. డిసెంబర్‌ క్వార్టర్‌లో సింగిల్‌ డిజిట్‌ క్షీణత ఉంటే, మార్చి త్రైమాసికంలో ఫ్లాట్‌గా విక్రయాలు ఉన్నాయి’’అని హెచ్‌యూఎల్‌ సీఎఫ్‌వో రితేష్‌ తివారీ తెలిపారు. ఇప్పటికీ ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలోనే ఉన్నందున అమ్మకాలు క్రమంగా పుంజుకుంటాయని అంచనా వేస్తున్నట్టు చెప్పా రు. మార్చి త్రైమాసికంలో హెచ్‌యూఎల్‌ నికర అమ్మకాలు 11 శాతం పెరిగితే, నిరక లాభం సైతం 13 శాతం మేర పెరిగింది. అంతర్జాతీయంగా మందగమనం, ఎల్‌నినో కారణంగా వర్షాలపై నెలకొన్న అనిశ్చితులతో సమీప కాలంలో నిర్వహణ వాతావరణం ఆటుపోట్లను ఎదుర్కోవచ్చని హెచ్‌యూఎల్‌ భావిస్తోంది.

2023–24 సంవత్సరంలో ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమ భవిష్యత్‌ సానుకూలంగా ఉంటుందని, అమ్మకాలతోపాటు మార్జిన్లలోనూ మెరుగుదల ఉంటుందని నువమా గ్రూప్‌ ఈడీ అబ్నీష్‌రాయ్‌ అంచనా వేశారు. ‘‘ముడి సరుకుల ధరలు తగ్గాయి. దీంతో కంపెనీలు క్రమంగా ధరలను తగ్గించొచ్చు. లేదంటే గ్రాములను పెంచొచ్చు. అమ్మకాలు పెరిగితే ధరలపై ఒత్తిడి తగ్గుతుంది’’అని రాయ్‌ చెప్పారు. అయితే, ఎల్‌నినో, ఎఫ్‌ఎంసీజీ విభాగంలో పెద్ద సంస్థగా అవతరించాలని రిలయన్స్‌ లక్ష్యం విధించుకోవడం వంటి సవాళ్లు ఉన్నట్టు పేర్కొన్నారు. మరోవైపు గోద్రేజ్‌ కన్జ్యూమర్‌ మార్చి త్రైమాసికంలో అమ్మకాల్లో 11 శాతం వృద్ధిని చూసింది. ప్రస్తుత సానుకూల వాతావర ణం మరింత బలపడుతుందని, అమ్మకాల్లో వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నట్టు గోద్రేజ్‌ కన్జ్యూమర్‌ ఎండీ, సీఈవో సుధీర్‌ సీతాపతి తెలిపారు.

ఇదీ చదవండి: బ్లాక్‌స్టోన్‌ చేతికి ఐజీఐ.. బెల్జియం డైమెండ్స్‌ సర్టిఫికేషన్‌ సంస్థ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top