ఆన్‌లైన్‌లో ఆవులు.. ఊరించిన ఆఫర్‌.. తీరా చూస్తే.. | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో ఆవులు.. ఊరించిన ఆఫర్‌.. తీరా చూస్తే..

Published Wed, Feb 28 2024 4:24 PM

Farmer Tries To Buy Discounted Cows Online Cyber Scam - Sakshi

ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేటప్పుడు డిస్కౌంట్లు ఊరిస్తుంటాయి.. ముందూ వెనక ఆలోచించకుండా నచ్చిన ఐటమ్‌ బుక్‌ చేసేస్తుంటారు. ఓ లాటరీ తగిలిందంటే లేదా ఓ ఆఫర్‌ ఇస్తున్నారంటే ఎందుకు, ఏంటి, ఎలా అన్న కనీస ఆలోచన లేకుండా సంబంధిత లింక్‌పై క్లిక్‌ చేస్తుంటారు. సరైన అవగాహన లేకుండా తీర ఏదైనా లింక్‌పై క్లిక్‌ చేసి సైబర్‌ సేరస్థుల ఉచ్చులో చిక్కుకుంటారు.

టెక్నాలజీ పెరుగుతున్నకొద్ది భారత్ డిజిటల్ రంగంలో పురోగమిస్తోంది. గాడ్జెట్‌ల నుంచి కిరాణా సామగ్రి వరకు అన్నీ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నారు. దాంతో విక్రయదారులు కస్టమర్లను ఆఫర్ల పేరుతో ఆకర్షిస్తున్నారు. స్మార్ట్‌పోన్లు వచ్చినప్పటి నుంచి చదువు ఉన్నవారు, లేనివారనే తేడా లేకుండా వాటిని ఉపయోగించి ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. అయితే చాలామందికి సైబర్‌నేరాలకు సంబంధించిన అవగాహనలేక కొందరు నేరస్థుల చేతుల్లో బలవుతున్నారు. 

తాజాగా గుర్‌గావ్‌కు చెందిన ఒక పాడి రైతు ఆన్‌లైన్‌లో ఆవులను కొనుగోలు చేయాలనుకుని సైబర్‌ నేరస్థులకు చిక్కి మోసపోయిన ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గుర్‌గావ్‌లోని పాండాలాలో నివసిస్తున్న సుఖ్‌బీర్(50) అనే పాడి రైతు ఆవులను కొనుగోలు చేయాలనుకున్నాడు. ఆఫ్‌లైన్ రేట్లతో పోలిస్తే ఆన్‌లైన్‌లో భారీ రాయితీ ఉండడం గమనించాడు. దాంతో ఆన్‌లైన్‌లో ఆవులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి మోసపోయాడు. ఈ మేరకు తన తండ్రి డబ్బు పోగొట్టుకున్న సంఘటనను తన కుమారుడు ప్రవీణ్‌ (30) వివరించాడు. 

ప్రవీణ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సుఖ్‌బీర్‌ నిత్యం పర్వీన్ ఫోన్‌ను ఉపయోగించేవాడు. యూట్యూబ్ వీడియోలను చూసేవాడు. గూగుల్‌లోని ఓ వెబ్‌సైట్‌లో ఆవులను చాలా తక్కువ ధరకు రూ.95,000కు అందజేస్తుందని గ్రహించాడు. ఇది సాధారణ ఆఫ్‌లైన్ ధరతో పోలిస్తే చాలా తక్కువని తెలుసుకున్నాడు. ఆన్‌లైన్‌లో ఆవులకు సంబంధించిన ఇతర వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాడు.

దాంతో ఆవుల కోసం ఆరాతీస్తున్న విషయాన్ని తెలుసుకున్న సైబర్‌ సేరస్థులు ఫోన్‌ నంబర్‌ ద్వారా వాట్సప్‌లో ఆవుల ఫోటోలను పంపడం ప్రారంభించారు. మొదట ఒక్కో ఆవు ధర రూ.35,000 అని పేర్కొన్నారు. నాలుగు ఆవులను కొనుగోలు చేసేందుకు సుఖ్‌బీర్ ఆసక్తి చూపగా, గోశాల కింద ఆవులను రిజిస్టర్‌ చేస్తామని అబద్ధపు హామీ ఇచ్చారు. పైగా ధరను రూ.95,000కు తగ్గించారు.

దాంతో అది నమ్మి ప్రవీణ్ తండ్రి జనవరి 19, 20 రోజుల్లో మొత్తం రూ.22,999 నగదు వారికి పంపించాడు. స్కామర్లు ముందుగా నిర్ణయించిన దానికంటే మరింత అధిక మొత్తంలో డబ్బు డిమాండ్‌ చేశారు. రోజులు గడుస్తున్నా ఆవులను పంపించలేదు. దాంతో మోసపోయానని గ్రహించిన సుఖ్‌బీర్‌ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 419, 420 కింద ఫిర్యాదు చేశాడు.

ఇదీ చదవండి: ప్రైవేట్‌ వైద్యం.. ఛార్జీలపై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు

ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..

ఆన్‌లైన్‌ మోసాలకు బలవకుండా ఉండాలంటే కింది జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

  • ఏవైనా లింకులపై క్లిక్‌ చేసే ముందు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి.
  • మీకు తెలియని వాటిని గురించి పూర్తిగా తెలుసుకున్నాకే షాపింగ్‌ చేయడం ఉత్తమం.
  • అడ్రస్‌ బార్‌లో https (http కాదు) ఉందో లేదో నిర్ధారణ చేసుకోండి.
  • ఆఫర్లు ఉన్నాయంటూ కనిపించే నకిలీ వెబ్‌సైట్ల జోలికివెళ్లొద్దు.
  • ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌కు సంబంధించిన లాగిన్‌ వివరాలు ఎవరితోనూ షేర్‌ చేసుకోవద్దు. 
  • ధర, డెలివరీ డేట్‌ లాంటి కొన్ని వివరాలు చూసి.. పేమెంట్‌ చేసేయకూడదు. ఆ ప్రోడెక్ట్‌ ఎప్పుడొస్తుంది, దాని ఎక్స్ఛేంజ్‌ పాలసీ, రిటర్న్‌ పాలసీ లాంటివి  కూడా చెక్‌ చేసుకోవాలి. 
  • పాస్‌వర్డ్‌ ఎంత కఠినంగా ఉంటే.. అంత మంచిది అని చెబుతుంటారు.

Advertisement
Advertisement