
అమెరికాకు, ప్రపంచానికి ఎలాన్ మస్క్ వంటి వ్యవస్థాపకులు పెద్ద సంఖ్యలో అవసరమని డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ అన్నారు. ఇటీవల పియర్స్ మోర్గాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ వ్యవస్థాపక విజయాలను ప్రత్యేకంగా ప్రశంసించారు. ముఖ్యంగా స్పేస్ ఎక్స్ వినూత్న రాకెట్ క్యాచింగ్ టెక్నాలజీ గురించి ప్రస్తావించారు.
అంతరిక్షం నుంచి తిరిగి వచ్చే రాకెట్ బూస్టర్లను పట్టుకోవడానికి యాంత్రిక టెక్నాలజీ (చాప్ స్టిక్‌లు) ఉపయోగించి మస్క్ ఇటీవల ప్రపంచం దృష్టిని ఆకర్షించారని నొక్కి చెబుతూ.. ‘మనకు 200 మంది ఎలాన్ మస్క్‌లు అవసరం. యూఎస్‌తోపాటు ప్రపంచానికి మస్క్ అవసరం ఉంది. పాశ్చాత్య నాగరికతకు తనలాంటి వారు కచ్చితంగా ఉపయుక్తంగా మారుతారు. దాంతోపాటు ప్రపంచానికి డొనాల్డ్ ట్రంప్ అవసరం కూడా ఉంది’ అని ఎరిక్ అన్నారు.
ఎలాన్ మస్క్, తన తండ్రి డొనాల్డ్ ట్రంప్ మధ్య సంబంధాన్ని ప్రస్తావిస్తూ ‘వారు ఇద్దరు బలమైన జట్టుగా ఉన్నారని భావిస్తున్నాను. ఒకరినొకరు భారీ ప్రశంసలతో, అపార గౌరవాన్ని కలిగి ఉన్నారు’ అని పేర్కొన్నారు. మస్క్ ఈ వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో స్పందించారు. ఎరిక్ ట్రంప్ ఇంటర్వ్యూలోని వ్యాఖ్యలపై ‘ధన్యవాదాలు’ అని రాసి హార్ట్ ఎమోజీని జోడించారు.
ఇదీ చదవండి: రెరా ఉన్నా 10 శాతం మార్టగేజ్ క్లాజ్ అవసరమా?