చిన్నబోయిన ఈక్విటీ ఫండ్స్‌ | Sakshi
Sakshi News home page

చిన్నబోయిన ఈక్విటీ ఫండ్స్‌

Published Fri, May 12 2023 4:04 AM

Equity Mutual Fund Inflows Decline 68percent In April To Lowest In Four Months - Sakshi

న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలకు ఏప్రిల్‌లో ఆదరణ తగ్గింది. మార్చి నెలతో పోలిస్తే పెట్టుబడులు 68 శాతం తగ్గిపోయి రూ.6,480 కోట్లకు పరిమితమయ్యాయి. అయినా, ఈక్విటీ పథకాల్లోకి నికరంగా పెట్టుబడులు రావడం వరుసగా 26వ నెలలోనూ నమోదైంది. వచ్చిన కొద్ది పెట్టుబడుల్లోనూ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్‌ పథకాలు ఎక్కువ మొత్తం ఆకర్షించాయి. ఏప్రిల్‌ నెల గణాంకాలను మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) గురువారం విడుదల చేసింది.

మొత్తం మీద 42 సంస్థలతో కూడిన మ్యూచువల్‌ పండ్స్‌ పరిశ్రమ ఏప్రిల్‌ నెలలో రూ.1.21 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ప్రధానంగా డెట్‌ విభాగంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం ఇందుకు దోహదం చేసింది. అంతకుముందు మార్చి నెలలో డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు నికరంగా రూ.56,884 కోట్ల పెట్టుబడులను నష్టపోవడం గమనార్హం. కానీ, ఏప్రిల్‌లో రూ.1.06 లక్షల కోట్లను రాబట్టాయి. దీంతో మ్యచువల్‌ ఫండ్స్‌ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ మార్చి చివరికి ఉన్న రూ.39.42 లక్షల కోట్ల నుంచి ఏప్రిల్‌ చివరికి రూ.41.62 లక్షల కోట్లకు ఎగిసింది.  
► ఈక్విటీల్లో ఫోకస్డ్‌ మినహా అన్ని విభాగాల్లోకి నికరంగా పెట్టుబడులు వచ్చాయి. స్మాల్‌ క్యాప్‌ పథకాల్లోకి రూ.2,182 కోట్లు, మిడ్‌క్యాప్‌ పథకాల్లోకి రూ.1,791 కోట్లు వచ్చాయి.
► మల్టీక్యాప్‌ ఫండ్స్‌ రూ.206 కోట్లు, లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ రూ.52 కోట్లు, లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ రూ.738 కోట్లు చొప్పున ఆకర్షించాయి.
► డివిడెండ్‌ ఈల్డ్‌ ఫండ్స్‌లోకి రూ.122 కోట్లు రాగా, సెక్టోరల్‌ (థీమ్యాటిక్‌) ఫండ్స్‌లోకి రూ. 614 కోట్లు, ఈఎల్‌ఎస్‌ఎస్‌ విభాగంలోకి రూ.61 కోట్లు, ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్స్‌లోకి రూ.550 కోట్లు, వ్యాల్యూ ఫండ్స్‌లోకి రూ.291 కోట్ల చొప్పున వచ్చాయి.  
► ఫోకస్డ్‌ ఫండ్స్‌ నుంచి ఇన్వెస్టర్లు రూ.131 కోట్లను వెనక్కి తీసుకున్నారు.
► డెట్‌ విభాగంలో లిక్విడ్‌ ఫండ్స్‌ అత్యధికంగా రూ.63,219 కోట్లను ఆకర్షించాయి.  
► మనీ మార్కెట్‌ ఫండ్స్‌లోకి రూ.13,961 కోట్లు, అల్ట్రాషార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌లోకి రూ.10,663 కోట్ల చొప్పున వచ్చాయి.  
► ఇక గోల్డ్‌ ఈటీఎఫ్‌లు సైతం రూ.125 కోట్లను ఆకర్షించాయి. ఇండెక్స్‌ ఫండ్స్‌లోకి రూ.147 కోట్లు, ఇతర ఈటీఎఫ్‌ల్లోకి రూ.6,790 కోట్ల చొప్పున వచ్చాయి.
   

సిప్‌ ద్వారా రూ.13,728 కోట్లు
సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లోకి ఏప్రిల్‌ నెలలో రూ.13,728 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు నెలలో వచ్చిన మొత్తం రూ.14,276 కోట్లతో పోలిస్తే తగ్గాయి. ఏటా ఆర్థిక సంవత్సరం చివరి నెలలో మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లోకి కాస్త అధిక మొత్తంలోనే పెట్టుబడులు వస్తుంటాయి. ఇన్వెస్టర్లు సిప్‌ ద్వారా ప్రస్తుత పెట్టుబడులు కొనసాగిస్తూనే.. ఈక్విటీ పథకాలకు అదనపు పెట్టుబడులను కేటాయించే విషయమై కాస్త వేచి చూసే ధోరణితో ఉన్నట్టు తెలుస్తోందని కోటక్‌ మహీంద్రా అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీకి చెందిన మనీష్‌ మెహతా పేర్కొన్నారు.

Advertisement
Advertisement