1.25 కోట్ల మంది విమాన ప్రయాణం | Sakshi
Sakshi News home page

1.25 కోట్ల మంది విమాన ప్రయాణం

Published Thu, Feb 9 2023 6:18 AM

Domestic air passenger traffic up 96percent to touch 1. 25 cr in January - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయంగా 2023 జనవరిలో 1.25 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. గతేడాది జనవరితో పోలిస్తే ఈ సంఖ్య 96 శాతం అధికమని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ‘కోవిడ్‌ ముందస్తు 2020 జనవరితో పోలిస్తే దేశీయ ప్రయాణికుల సంఖ్య గత నెలలో 2 శాతం తగ్గింది. దేశీయ ప్రయాణికుల రద్దీలో రికవరీ మెరుగ్గా ఉన్నప్పటికీ.. భారతీయ విమానయాన సంస్థల ఆర్థిక పనితీరు సమీప కాలంలో ఒత్తిడిలో ఉండే అవకాశం ఉంది.

2022–23లో ప్రయాణికుల రద్దీలో అర్థవంతమైన మెరుగుదల ఆశించినప్పటికీ పరిశ్రమ ఆదాయాల్లో రికవరీ వేగం క్రమంగా ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.23,500 కోట్ల నికర నష్టంతో పోలిస్తే 2022–23లో నికర నష్టం తక్కువగా ఉంటుందని అంచనా. ప్రధానంగా ప్రయాణికుల రద్దీ, ఛార్జీల పెంపుదల, తక్కువ వడ్డీ భారం ఇందుకు కారణం. 2022 జనవరితో పోలిస్తే గత నెలలో సామర్థ్య విస్తరణ 42 శాతం ఎక్కువ. కోవిడ్‌ ముందస్తుతో పోలిస్తే 6 శాతం తక్కువ’ అని ఇక్రా తెలిపింది.  

త్వరగా రికవరీ..
‘కార్యకలాపాలలో సాధారణ స్థితి, మహమ్మారి ప్రభావం తగ్గడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ప్రయాణికుల రద్దీలో త్వరిత పునరుద్ధరణ ఉంటుందని అంచనా. పెరిగిన పోటీ వాతావరణం మధ్య యూఎస్‌ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి క్షీణతకుతోడు ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ (ఏటీఎఫ్‌) ధరలు పెరగడం వల్ల దేశీయ విమానయాన సంస్థలకు ఆదాయాల రికవరీ క్రమంగా ఉంటుంది.

ప్రస్తుత ఏటీఎఫ్‌ ధరలు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 32 శాతం అధికం. పెరిగిన ఏటీఎఫ్‌ ధరలు సమీప, మధ్య కాలానికి విమానయాన సంస్థల ఆదాయాలు, నగదు నిల్వలకు పెద్ద ముప్పుగా కొనసాగుతాయి. అలాగే లీజు అద్దెలు, నిర్వహణ వ్యయం, ఇతర ఖర్చులను ప్రతికూలంగా ప్రభావితం చేసే యూఎస్‌ డాలర్‌తో భారత రూపాయి విలువ క్షీణించడం విమానయాన సంస్థల వ్యయ నిర్మాణంపై ప్రధాన ప్రభావాన్ని చూపుతుంది. అధికం అయిన వ్యయాలకు అనుగుణంగా ఛార్జీల పెంపుదల ఉండేలా ఎయిర్‌లైన్స్‌ చేసే ప్రయత్నాలు వారి లాభదాయకతలో కీలకం కానున్నాయి’ అని ఇక్రా వివరించింది. 

Advertisement
Advertisement