
ఐఏటీఏ గణాంకాల్లో వెల్లడి
న్యూఢిల్లీ: గతేడాది 24.1 కోట్ల మంది ప్యాసింజర్లతో ప్రపంచంలోనే అయిదో అతి పెద్ద ఏవియేషన్ మార్కెట్‌గా భారత్ ఆవిర్భవించింది. అత్యంత రద్దీగా ఉండే జంట విమానాశ్రయాల జాబితాలో ముంబై–ఢిల్లీకి చోటు దక్కింది. 2024 సంవత్సరానికి గాను అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ సమాఖ్య ఐఏటీఏ విడుదల చేసిన వరల్డ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
వీటి ప్రకారం గతేడాది భారత్‌లో విమాన ప్రయాణికుల సంఖ్య 2023తో పోలిస్తే 11 శాతం పెరిగి 21.1 కోట్లుగా నమోదైంది. అత్యధికంగా 87.6 కోట్ల మంది ప్యాసింజర్లతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, 74.1 కోట్ల మందితో చైనా రెండో స్థానంలో ఉంది. ఇక యునైటెడ్ కింగ్‌డం మూడో స్థానంలో (26.1 కోట్ల మంది) స్పెయిన్ 4వ స్థానంలో (24.1 కోట్ల మంది ప్రయాణికులు) నిల్చాయి. టాప్ 10 జంట ఎయిర్‌పోర్టుల్లో 59 లక్షల మంది ప్రయాణికులతో ముంబై–ఢిల్లీ జత 7వ ర్యాంకులో ఉంది.
అంతర్జాతీయంగా ప్రీమియం క్లాస్ ప్రయాణాలు (బిజినెస్, ఫస్ట్ క్లాస్) 11.8 శాతం, ఎకానమీ ట్రావెల్ 11.5 శాతం పెరిగాయి. మొత్తం ఇంటర్నేషనల్ ప్యాసింజర్లలో ప్రీమియం క్లాస్ ట్రావెలర్లు 6 శాతం పెరిగి 11.69 కోట్లకు చేరింది. ప్రాంతాలవారీగా చూస్తే ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రీమియం ప్యాసింజర్ల సంఖ్య 22.8 శాతం పెరిగి 2.1 కోట్లకు చేరింది. యూరప్, లాటిన్ అమెరికా, మధ్య ప్రాచ్యం, ఉత్తర అమెరికాల్లో ప్రీమియం ప్రయాణికుల సంఖ్య, ఎకా నమీ తరగతి వారికన్నా అధికంగా నమోదైంది.