sakshi excellence awards: ‘తెలుగు ఎన్నారై ఆఫ్‌ ది ఇయర్‌’ గా డాక్టర్‌ ప్రేమ్‌సాగర్‌ రెడ్డి

Doctor Prem Sagar Reddy Get Telugu Nri Of The Award - Sakshi

విద్యుత్‌ సౌకర్యం కూడా లేని ఒక మారుమూల గ్రామంలో పుట్టి కిరోసిన్‌ దీపం వెలుతురులో చదువుకుని వైద్య రంగంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు డాక్టర్‌ ప్రేమ్‌సాగర్‌ రెడ్డి. నెల్లూరు జిల్లాలో నిడిగుంటపాలెం అనే ఒక చిన్న గ్రామానికి చెందిన ప్రేమ్‌సాగర్‌ రెడ్డి అక్కడే హైస్కూల్‌ వరకు చదువుకున్నారు. తిరుపతిలోని ఎస్‌.వి మెడికల్‌ కాలేజీలో చేరి 1973లో ఎం.బి.బి.ఎస్‌ పూర్తి చేశారు.

హౌస్‌ సర్జన్‌ అయ్యాక అమెరికా వెళ్లి న్యూయార్క్‌లోని డౌన్‌ స్టేట్‌ మెడికల్‌ సెంటర్లో ఇంటర్నల్‌ మెడిసిన్‌లో రెసిడెన్సీ తో పాటు కార్డియాలజీలో ఫెలోషిప్‌ పూర్తి చేశారు. 1981లో సదరన్‌ కాలిఫోర్నియాలో మెడికల్‌ ప్రాక్టీస్‌ ప్రారంభించారు. అయిదు వేలకుపైగా కార్డియాక్‌ ప్రొసీజర్స్‌ చేసి సమర్థుడైన వైద్యుడిగా పేరు  తెచ్చుకున్నారు. 1985లో కాలిఫోర్నియాలోనే ‘ప్రైమ్‌ కేర్‌ మెడికల్‌ గ్రూప్స్‌’ పేరుతో మల్టీస్పెషాలిటీ మెడికల్‌ గ్రూప్‌ ప్రారంభించారు.

1990లో కాలిఫోర్నియాలో సొంతంగా 150 పడకల అక్యూట్‌ కేర్‌ హాస్పిటల్‌ని నిర్మించారు.  ఇప్పుడు ప్రైమ్‌ హెల్త్‌కేర్‌ ఆధ్వర్యంలో యు.ఎస్‌.లోని 14 రాష్ట్రాల్లో 46 ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు.  యు.ఎస్‌.లో టాప్‌–10 వైద్యవ్యవస్థల్లో ఒకటిగా ప్రైమ్‌ కేర్‌ గుర్తింపు పొందింది.  ఒక చారిటబుల్‌ ఫౌండేషన్‌ను కూడా స్థాపించి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు.  
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top