విదేశాలకు పారిపోతారేమో.. అష్నీర్‌ దంపతులకు ఢిల్లీ హై కోర్టు కీలక ఆదేశాలు | Sakshi
Sakshi News home page

విదేశాలకు పారిపోతారేమో.. అష్నీర్‌ దంపతులకు ఢిల్లీ హై కోర్టు కీలక ఆదేశాలు

Published Sat, May 25 2024 8:15 AM

Delhi Court Asked Rs 80 Crores From Ashneer Grover And His Wife To Travel To Us

ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ భారత్‌పే కో-ఫౌండర్‌ అష్నీర్‌ గ్రోవర్‌, అతని భార్య మాధురి జైన్‌ గ్రోవర్‌లకు ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అష్నీర్‌ దంపతులు త్వరలో అమెరికాకు వెళ్లనున్నారు. అయితే వాళ్లిద్దరూ అమెరికాకు వెళ్లే ముందే సెక్యూరిటీ డిపాజిట్‌ కింద రూ.80 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.

దీంతో పాటు అష్నీర్‌, మాధురీలకు యూఏఈ గోల్డెన్‌ వీసా ఉంది. ఈ వీసా ఉన్న వారికి యూఏఈ ప్రభుత్వం తమ దేశ పౌరులుగా గుర్తిస్తూ వారికి ఎమిరేట్స్‌ కార్డ్‌ అనే ఐడెంటిటీ కార్డ్‌ ఇస్తుంది. ముందస్తు జాగ్రత్తగా ఎమిరేట్స్‌ కార్డ్‌ను కోర్టుకు సబ్మిట్‌ చేయాలని సూచించింది. అర్హులైన ఈ కార్డ్‌ దారులు 10ఏళ్ల పాటు యూఏఈ దేశ పౌరులుగా గుర్తింపు లభిస్తుంది.

కేసేంటి
భారత్‌పేలో విధులు నిర్వహించే సమయంలో అష్నీర్‌ గ్రోవర్‌ దంపతులు విలాసాల రుచి మరిగి రూ.81 కోట్ల సంస్థ నిధుల్ని కాజేశారు. ఆ కుంభకోణం వెలుగులోకి రావడంతో భారత్‌పే వారిద్దరిని సంస్థ నుంచి తొలగించింది. ఇదే అంశంపై అష్నీర్‌ దంపతుల్ని విచారించాలని కోరుతూ భారత్‌పే ఢిల్లీ హైకోర్ట్‌ను ఆశ్రయించింది. ఆ కేసులో వాళ్లిద్దరూ విదేశాలకు పారిపోకుండా గతేడాది నవంబర్‌లో ఎకనమిక్స్‌ అఫెన్స్‌ వింగ్‌ (ఈఓడబ్ల్యూ) లుకౌట్‌ నోటీసులు జారీ చేసింది.

విదేశాలకు వెళ్లేందుకు  
ఈ తరుణంలో అమెరికాలో ఉన్న కుటుంబసభ్యులను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. జూన్ 17 నుండి జూన్ 25 వరకు బర్కిలీలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో సమ్మర్ కోర్సు, నేషనల్ స్టూడెంట్ లీడర్‌షిప్ కాన్ఫరెన్స్ కోసం తమ కుమారుడికి ఆహ్వానం అందిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.  

విదేశాలకు పారిపోతే
ఈఓడబ్ల్యూ తరఫు న్యాయవాది ఈ పిటిషన్‌లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అష్నీర్‌కు, అతని భార్య మాధురి జైన్‌ గ్రోవర్‌లకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తే, వారు దేశానికి తిరిగి రాకపోయే అవకాశం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. అందుకు అష్నీర్‌ దంపతుల న్యాయవాది దంపతులు దేశం విడిచి పారిపోరని, కలిసి ప్రయాణించే బదులు విడివిడిగా వెళ్లేందుకు అనుమతించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు విదేశాలకు వెళ్లేందుకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.

షరతులు వర్తిస్తాయ్‌
అయితే వారి ప్రయాణానికి సంబంధించి కొన్ని షరతులు విధించింది. అష్నీర్‌ గ్రోవర్‌, మాధురి జైన్‌ గ్రోవర్‌లు విదేశాలకు ఎప్పుడు వెళ్లాలన్న వారి ప్రయాణ ప్రణాళికలు, వారి ప్రయాణం, వసతి, ఖర్చులతో ఇలా మొత్తం సమాచారాన్ని కోర్టు, దర్యాప్తు అధికారులకు అందించాలని తీర్పులో వెలువరించింది.  

విదేశాలకు విడివిడిగానే 
కోర్టు ఆదేశాలతో అష్నీర్‌ గ్రోవర్‌ మే 26న అమెరికాకు వెళ్లి జూన్ 14న తిరిగి రావాల్సి ఉండగా, మాధురీ జైన్ జూన్ 15న ప్రయాణించి జూలై 1న తిరిగి రానున్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement