డెయిరీ పరిశ్రమలో వృద్ధి జోరు

Dairy industry in India to grow by 9-11percent in FY22 - Sakshi

2021–22లో 9–11 శాతం ఉండొచ్చు

ఇక్రా రేటింగ్స్‌ అంచనా

ముంబై: ఆర్థిక రంగ కార్యకలాపాలు ఊపందుకున్నందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) డెయిరీ రంగం 9–11 శాతం మధ్య వృద్ధిని సాధించొచ్చని ఇక్రా రేటింగ్స్‌ అంచనా వేసింది. తలసరిగా పాలు, పాల పదార్థాల వినియోగం పెరగడం, పట్టణీకరణతో ఆహార పరమైన ప్రాధాన్యతల్లో వస్తున్న మార్పులు, ప్రభుత్వం నుంచి స్థిరమైన మద్దతు కూడా డైరీ వృద్ధికి తోడ్పడతాయని పేర్కొంది. దీర్ఘకాలంలో ఈ పరిశ్రమకు స్థిరమైన రేటింగ్‌ ఇచ్చింది. కరోనా మహమ్మారి ప్రభావం తర్వాత పరిశ్రమలో స్థిరమైన రికవరీ కనిపించినట్టు తెలిపింది. ‘‘డిమాండ్‌ పుంజుకోవడంపై మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) కరోనా కేసుల ప్రభావం పడింది.

సంస్థాగత స్థాయిలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. తాజా కేసలు గణనీయంగా తగ్గిపోవడం, వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగే పరిస్థితులతో ఇటీవలి కాలంలో డిమాండ్‌ చక్కగా పుంజుకుంది. పాడి పరిశ్రమలో సంఘటిత రంగం (కంపెనీలు) వాటా 26–30 శాతంగా ఉంటుంది. అసంఘటిత రంగంతో (వ్యక్తులు/సంఘాలు)తో పోలిస్తే సంఘటిత రంగమే వేగవంతమైన వృద్ధిని చూస్తోంది. ఇదే ధోరణి ఇక ముందూ కొనసాగుతుంది’’అని ఇక్రా రేటింగ్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ షీతల్‌ శరద్‌ పేర్కొన్నారు. పాడి రంగంలో కేవలం పాల (సగంపైన వాటా) వరకే చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి స్థిరంగా 6–7 శాతం మధ్యే ఉంటుందని ఇక్రా అంచనా వేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top