టిక్‌టాక్‌పై వేటు.. లోకల్‌ ‘జోష్‌’! | Sakshi
Sakshi News home page

టిక్‌టాక్‌పై వేటు.. లోకల్‌ ‘జోష్‌’!

Published Sat, Dec 26 2020 1:02 AM

 Dailyhunt Launches Short Video App Josh - Sakshi

న్యూఢిల్లీ: టిక్‌టాక్‌పై నిషేధంతో దేశీయ స్టార్టప్‌లకు ఊహించని అవకాశం తలుపుతట్టినట్టయింది. టిక్‌టాక్‌కు ఉన్న భారీ యూజర్లను సొంతం చేసుకునేందుకు చాలా సంస్థలు వేగంగా ఈ మార్కెట్‌ వైపు అడుగులు వేశాయి. షార్ట్‌ వీడియో మేకింగ్‌ యాప్‌లను (స్వల్ప కాల నిడివితో కూడిన వీడియోలను సృష్టించి ఇతర యూజర్లతో పంచుకునే వేదికలు) తీసుకురావడమే కాదు.. వీటిల్లో కొన్ని విజయాన్ని సాధించడం 2020లో చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామంగానే చెప్పుకోవాలి.

దేశీయ వినియోగదారుల డేటా రక్షణ, దేశ భద్రతతోపాటు, చైనా ద్వంద్వ వ్యవహారశైలికి తగిన చెక్‌ పెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం వందలాది చైనా మద్దతు కలిగిన యాప్‌లను ఈ ఏడాది నిషేధ జాబితాలో పెట్టేసింది. అందులో భాగంగానే టిక్‌టాప్‌పై జూన్‌లో వేటు పడింది. టిక్‌టాక్‌కు యూజర్లు భారీగా జత కూడుతున్న తరుణంలో ఈ నిషేధం ఆ సంస్థకు మింగుడుపడలేదు. కానీ, ఇది కొత్త వేదికలకు ప్రాణం పోసింది. డైలీహంట్‌కు చెందిన ‘జోష్‌’ యాప్‌ సహా దేశీయ షార్ట్‌ వీడియో యాప్‌లు 40% వాటాను ఇప్పటికే సొంతం చేసుకున్నట్టు బెంగళూరుకు చెందిన కన్సల్టింగ్‌ సంస్థ రెడ్‌సీర్‌ ఓ నివేదికలో వెల్లడించింది.  

నాలుగు రెట్ల వృద్ధి..  
2020 జూన్‌లో నిషేధం విధించే నాటికి చైనాకు చెందిన టిక్‌టాక్‌ (బైట్‌డ్యాన్స్‌కు చెందిన ప్లాట్‌ఫామ్‌)కు 16.7 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. కానీ, సరిగ్గా అంతకు రెండేళ్ల క్రితం నాటికి 2018 జూన్‌ వరకు.. ఈ సంస్థకు 8.5 కోట్ల వినియోగదారులే ఉండడం గమనార్హం. రెండేళ్లలోనే యూజర్లను రెట్టింపు చేసుకుని వేగంగా దూసుకుపోతున్న టిక్‌టాక్‌కు బ్రేక్‌ పడింది. దీంతో ప్రత్యామ్నాయ వేదికల కోసం యూజర్ల అన్వేషణ మొదలైంది. ఈ క్రమంలో జోష్, ఎమ్‌ఎక్స్‌ టకాటక్, రోపోసో, చింగారి, మోజ్‌ మైట్రాన్, ట్రెల్‌ ఇలా ఎన్నో వేదికలు పుట్టుకొచ్చాయి. 

షార్ట్‌ వీడియో మార్కెట్‌పై దిగ్గజ సంస్థలైన ఫేస్‌బుక్, గూగుల్‌ కూడా ఆశపడ్డాయి. ఫలితంగా రీల్స్‌ పేరుతో ఫేస్‌బుక్, షార్ట్స్‌ పేరుతో యూట్యూబ్‌ సంస్థలు కొత్త వేదికలను తీసుకొచ్చాయి. టిక్‌టాక్‌ మార్కెట్‌ వాటాలో 40 శాతాన్ని భారత ప్లాట్‌ఫామ్‌లు సొంతం చేసుకున్నట్టు రెడ్‌సీర్‌ సంస్థ తెలిపింది. ఇందులో జోష్‌ ముందంజలో ఉందని.. నాణ్యమైన కంటెంట్, విస్తృతమైన కంటెంట్‌ లైబ్రరీ జోష్‌ బలాలుగా పేర్కొంది.  ‘‘భారత సంస్థలు ప్రతి రోజూ తాజా నాణ్యమైన సమాచారాన్ని ఆఫర్‌ చేయగలవు. దీంతో షార్ట్‌ వీడియో మార్కెట్‌ వచ్చే ఐదేళ్లలో నాలుగు రెట్లకు పైగా వృద్ధి చెందుతుంది’’ అని రెడ్‌సీర్‌  సీఈవో అనిల్‌ కుమార్‌ ప్రకటించారు.

విస్తరణపై చూపు..
ఇన్‌మొబి గ్రూప్‌ సబ్సిడరీ సంస్థ, రొపోసో యజమాని అయిన గ్లాన్స్‌ ఈ వారంలోనే 145 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులను గూగుల్, మిత్రిల్‌ క్యాపిటల్‌ నుంచి సమీకరించడం ద్వారా మరింత విస్తరించే ప్రణాళికలతో ఉండడం గమనార్హం. గ్లాన్స్, రోపోసో ప్లాట్‌ఫామ్‌ల్లో మరిన్ని ఉత్పత్తులను తీసుకురావడంతోపాటు ఆర్టిïఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను బలోపేతం చేసుకోవడానికి ఈ నిధులను ఖర్చు చేయనున్నట్టు సంస్థ ఇప్పటికే ప్రకటించింది. రొపోసోను గ్లాన్స్‌ గత ఏడాది బయటకు వెల్లడించని మొత్తానికి కొనుగోలు చేసింది.

‘‘భారత్‌లో ప్రస్తుతానికి ఇంటర్నెట్‌ వినియోగించే వారు 60 కోట్ల మంది ఉండగా.. ఇందులో షార్ట్‌ వీడియో కంటెంట్‌ను 45 శాతం మంది (27 కోట్లు) వినియోగిస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో ఇంటర్నెట్‌ యూజర్లు 60 కోట్ల నుంచి 97 కోట్లకు పెరగనున్నారు. స్వల్పకాల నిడివితో కూడిన కంటెంట్‌ మార్కెట్‌ 4 రెట్లు వృద్ది చెందుతుంది. ప్రస్తుతం నెలవారీగా 110 బిలియన్‌ నిమిషాలను వీటిపై వెచ్చిస్తుండగా.. 400–500 బిలియన్‌ నిమిషాలకు విస్తరిస్తుంది’’ అంటూ రెడ్‌సీర్‌ సంస్థ తన నివేదికలో ప్రస్తావించింది. ఒకవేళ టిక్‌టాక్‌పై నిషేధాన్ని ఎత్తివేసినట్టయితే పరిస్థితుల విషయంలో పలు ప్రశ్నలు   ప్రశ్నలు మిగిలే ఉన్నాయని రెడ్‌సీర్‌ పేర్కొంది.   

Advertisement
 
Advertisement
 
Advertisement