
భారతదేశంలో ఒకప్పుడు ఎంతో ప్రాచుర్యం పొంది.. ఇప్పుడు నిషేధంలో ఉన్న ప్రముఖ సోషల్ మీడియా యాప్ 'టిక్‌టాక్' ఉద్యోగుల కోసం ఎదురు చూస్తోంది. గురుగ్రామ్‌లోని ఆఫీసులో రెండు ఖాళీలను భర్తీ చేయనున్నట్లు లింక్డిన్‌లో పోస్ట్ చేసింది. ఇందులో ఒకటి కంటెంట్ మోడరేటర్ (బెంగాలీ స్పీకర్), మరొకటి మంచి భాగస్వామ్యం.. కార్యకలాపాల లీడ్ కోసం. దీన్నిబట్టి చూస్తుంటే టిక్‌టాక్ మళ్ళీ భారత్‌లోకి అందుబాటులోకి రానుందా అనే ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.
బైట్‌డాన్స్ యాజమాన్యంలోని షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ కంపెనీ వెబ్‌సైట్ ఇటీవల భారతదేశంలో మళ్లీ అందుబాటులోకి వచ్చింది. అయితే.. దేశంలో టిక్‌టాక్ సేవలను తిరిగి ప్రారంభించడానికి కావలసిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేయలేదని అధికారులు తెలిపారు. ఆగస్టు 22న, కూడా ఈ చైనా యాప్ భారతదేశంలో తిరిగి అనుమతించారనే వాదనలను అధికారులు తిరస్కరించారు.
టిక్‌టాక్ వెబ్‌సైట్‌లోని ల్యాండింగ్ పేజీ ఓపెన్ చేయగానే.. భారతదేశంలో ఇది అందుబాటులో లేదని సందేశాన్ని ప్రదర్శించేది. కానీ గత వారం డెస్క్‌టాప్ ద్వారా యాక్సెస్ చేసినప్పుడు ఈ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన 'అబౌట్ అస్' పేజీ కనిపించింది. అయితే ఎలాంటి వీడియోలు కనిపించలేదు.
ఇదీ చదవండి: స్టార్‌లింక్ ఇంటర్నెట్ కోసం ఆధార్ వెరిఫికేషన్: సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ ఇలా
టిక్‌టాక్ యాప్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో లేదు. "మేము భారతదేశంలో టిక్‌టాక్‌కు మళ్ళీ స్టార్ట్ చేయలేదు. ఇప్పటికి కూడా భారత ప్రభుత్వ ఆదేశాన్ని పాటిస్తూనే ఉన్నాము" అని టిక్‌టాక్ ప్రతినిధి ఒకరు ఒక ప్రకటనలో తెలిపారు.
భారత.. చైనా దళాల మధ్య గాల్వాన్ లోయ ఘర్షణ తర్వాత జాతీయ భద్రతా సమస్యలను పేర్కొంటూ భారతదేశం జూన్ 2020లో టిక్‌టాక్‌తో పాటు 58 ఇతర చైనీస్ యాప్‌లను నిషేధించింది. అయితే ఇప్పుడు ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడే సంకేతాలను కనిపిస్తున్నాయి. ఏడేళ్ల తరువాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. చైనా సోషల్ మీడియా యాప్ మళ్ళీ అందుబాటులోకి వస్తుందేమో అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.