
ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్.. ఈ-కేవైసీ వెరిఫికేషన్ కోసం ఆధార్‌ను ఉపయోగించడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీన్నిబట్టి చూస్తే.. భారతదేశంలో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
స్టార్‌లింక్ ఇప్పటికే టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT).. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPACe) నుంచి భారతదేశంలో తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి కావలసిన అనుమతిని పొందింది. అయితే జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా టెక్నాలజీ.. మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం వంటి కొన్ని ఆన్-ది-గ్రౌండ్ సన్నాహాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని కూడా త్వరలోనే పూర్తి చేయడానికి కావాల్సిన ఏర్పాట్లను కంపెనీ పూర్తి చేస్తోంది.
స్టార్‌లింక్ భారతదేశంలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత కొత్త కస్టమర్‌ల ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను సులభతరం చేయడమే కాకుండా.. వేగవంతమైన, మరింత సురక్షితమైన సేవలను అందించడానికి ప్రస్తుతం యూఐడీఏఐతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్పష్టమవుతోంది.
స్టార్‌లింక్ ఇంటర్నెట్ కోసం ఈకేవైసీ చేసుకున్న యూజర్లు హైస్పీడ్ ఇంటర్నెట్ ఆస్వాదించవచ్చు. ఇది గృహాల్లో వినియోగించడానికి, సంస్థల్లో ఉపయోగించడానికి కూడా అనుకూలంగా ఉంటుందని.. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
భారతదేశంలో స్టార్‌లింక్ ధరలు
స్టార్‌లింక్ హార్డ్‌వేర్ ధర రూ.30,000 నుంచి రూ.40,000 వరకు ఉంటుందని అంచనా. ఇందులో శాటిలైట్ డిష్ & వై-ఫై రౌటర్ ఉన్నాయి. అయితే నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు రూ.3,000 నుంచి రూ.5,000 వరకు ఉంటుంది. యూజర్లు 25 Mbps నుంచి 220 Mbps మధ్య ఇంటర్నెట్ వేగాన్ని ఆస్వాదించవచ్చు. ధరలు త్వరలోనే అధికారికంగా వెల్లడవుతాయి.
ఇదీ చదవండి: రెండేళ్లకే మస్క్ కంపెనీ వీడిన 16 ఏళ్ల కుర్రాడు
స్టార్‌లింక్ సేవలను ప్రారంభ దశలో 20 లక్షల కనెక్షన్‌లకు మాత్రమే పరిమితం చేశారు. అయితే పరికరాల సరఫరా కోసం భారతి ఎయిర్‌టెల్ & రిలయన్స్ జియోలతో ఒప్పందం కుదుర్చుకుంది. మారుమూల ప్రాంతాలకు కూడా హైస్పీడ్ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో స్టార్‌లింక్ శాటిలైట్ సేవలను ప్రారంభించనున్నారు.