
దేశీయ ఐటీ సంస్థ టీసీఎస్ (TCS) ఇటీవల భారీ లేఆఫ్ ప్రణాళికను (TCS Layoff)ప్రకటించింది. సుమారు 12,000 మందిని తొలగిస్తున్నట్లు తెలిపింది. ఈ తొలగింపులతో ప్రభావితమవుతున్న ఉద్యోగులకు వివిధ స్థాయిల సెవెరెన్స్ ప్యాకేజీని అమలు చేస్తోంది. ఏఐ, డేటా, సైబర్ సెక్యూరిటీలో కంపెనీ పెట్టుబడులను పెంచుతున్న నేపథ్యంలో సిబ్బంది పునర్‌వ్యవస్థీకరణ చేపట్టింది. ఈ నిర్ణయం సోషల్ మీడియాలో కలకలం రేపింది.
సంస్థలో ఎవరి నైపుణ్యాలైతే పనికిరావో లేదా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం పొందడానికి అవకాశం లేదో అలాంటి వారిని టీసీఎస్ తొలగిస్తోంది. వీరందరికీ మూడు నెలల నోటీసు వ్యవధి చెల్లింపుతో పాటు ఆరు నెలల నుండి ఒక సంవత్సరం జీతాన్ని సెవెరెన్స్ ప్యాకేజీ కింద అందిస్తోంది. ఇది సంస్థలో వారి సర్వీస్ కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అయితే అందరికీ కనీసం ఆరు నెలల వేతనాన్ని ఇవ్వాలని నిర్ణయించారు.
ప్రభావిత ఉద్యోగులు మరో ఉద్యోగం వెతుక్కోవడంలో సహాయపడటానికి, టీసీఎస్ మూడు నెలల వరకు అవుట్ ప్లేస్ మెంట్ ఏజెన్సీ ఫీజులను అందిస్తోంది. అదే జూనియర్ అసోసియేట్లకు అయితే ఇంకొన్ని నెలలు ఈ సహాయాన్ని అందించనుందని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. ఇక అలాగే ఉద్యోగులకు అందించే మానసిక ఆరోగ్య సాయం టీసీఎస్ కేర్స్‌ను కూడా కొన్నాళ్ల పాటు వారికి కొనసాగించనుంది.
బెంచ్‌లో ఉన్నవారికి మూణ్నెళ్ల జీతమే..
బెంచ్‌లో ఉండి లేదా ఎనిమిది నెలలకు పైగా వర్క్ కేటాయించని ఉద్యోగులు తొలగింపునకు గురైతే వారు ప్రామాణిక మూడు నెలల నోటీసు వ్యవధి వేతనాన్ని మాత్రమే పొందుతారు. రిటైర్‌మెంట్‌కు దగ్గరగా ఉన్నవారికి, పదవీ విరమణ ప్రయోజనాలు, బీమాకు పూర్తి ప్రాప్యతతో ముందస్తు రిటైర్‌మెంట్ ఎంపికను టీసీఎస్ అందించింది. అలాంటి వారు మిగిలిఉన్న సర్వీస్ కాలాన్ని బట్టి ఆరు నెలల నుండి రెండేళ్ల వరకు జీతాన్ని సెవెరెన్స్ ప్యాకేజీగా అందుకుంటారు.
ఇదీ చదవండి: దీపావళి ధమాకా.. ఐఫోన్‌పై రూ.55 వేల డిస్కౌంట్!