
ప్రస్తుతం మెట్రోల్లోనే ఎక్కువ
టైర్–2, 3 పట్టణాల్లో విస్తరణ అవకాశాలు
టీమ్‌లీజ్ సర్వీసెస్ నివేదిక అంచనా
ముంబై: మహిళలకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు, ముఖ్యంగా కాంట్రాక్టు పనులు మెట్రోల్లో, పారిశ్రామిక కేంద్రాల్లోనే ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయని.. భవిష్యత్తులో టైర్ 2, 3 పట్టణాల్లో విస్తరణకు అపార అవకాశాలున్నాయని టీమ్‌లీజ్ సర్వీసెస్ నివేదిక వెల్లడించింది. మహిళలకు కాంట్రాక్టు ఉద్యోగాల్లో 28.7 శాతం వాటాతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా, తమిళనాడు 14.2 శాతం, కర్ణాటక 14.1 శాతం మేర అవకాశాలను అందిస్తున్నట్టు తెలిపింది.
ఆ తర్వాత తెలంగాణలో 7.8 శాతం, గుజరాత్‌లో 7.2 శాతం, యూపీలో 6.6 శాతం చొప్పున మహిళలకు కాంట్రాక్టు ఉద్యోగాలు లభిస్తున్నట్టు వెల్లడించింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో మరింత మందికి ఈ అవకాశాల కల్పనకు గణనీయమైన అవకాశాలున్నట్టు గుర్తు చేసింది. టీమ్‌లీజ్ సర్వీసెస్ తన అంతర్గత డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది.
రిటైల్‌లోనే ఎక్కువ
మహిళలకు కాంట్రాక్టు ఉద్యోగాల్లో 29.8 శాతం ఒక్క రిటైల్ రంగమే కల్పిస్తోందని టీమ్‌లీజ్ సర్వీసెస్ నివేదిక వెల్లడించింది. ఐటీ రంగంలో 20.7 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో 18.9 శాతం చొప్పున ఉద్యోగాలు లభిస్తున్నట్టు తెలిపింది. తయారీలో 10.8 శాతం, విద్యుత్, ఇంధన రంగంలో 5 శాతం, టెలికంలో 4 శాతం చొప్పున కాంట్రాక్టు ఉద్యోగాల్లో మహిళల ప్రాతినిధ్యం ఉన్నట్టు పేర్కొంది.
సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్‌తో కూడిన స్టెమ్ విద్యలో ఎక్కువ మంది మహిళలు చేరడం అన్నది ఐటీ, రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో మరింత మందికి అవకాశాలను చేరువ చేస్తుందని తెలిపింది. కాంట్రాక్టు మహిళా ఉద్యోగుల్లో 62.2 శాతం మంది వయసు 18–27 ఏళ్ల మధ్యలో ఉంటే.. 29.4 శాతం మంది 28–37 ఏళ్ల వయసులో ఉండడం అన్నది యువ ప్రాతినిధ్యాన్ని సూచిస్తున్నట్టు పేర్కొంది. 38–47 ఏళ్ల వయసులోని మహిళలు 6.6 శాతం, 48 ఏళ్లకుపైన వయసున్న మహిళలు 1.9 శాతం చొప్పున కాంట్రాక్టు ఉద్యోగాల్లో ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది.