ప్రథమార్ధంలో మెరుగ్గా ఉద్యోగావకాశాలు | CII poll shows CEOs expect better job creation prospects in first half of FY23 | Sakshi
Sakshi News home page

ప్రథమార్ధంలో మెరుగ్గా ఉద్యోగావకాశాలు

Jul 15 2022 1:23 AM | Updated on Jul 15 2022 1:23 AM

CII poll shows CEOs expect better job creation prospects in first half of FY23 - Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (ఏప్రిల్‌–సెప్టెంబర్‌) ఉద్యోగాల కల్పనకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కంపెనీల సీఈవోలు భావిస్తున్నారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన సర్వేలో మెజారిటీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఈ విషయం వెల్లడించారు. ఇటీవల రెండో జాతీయ మండలి సమావేశం సందర్భంగా సీఐఐ నిర్వహించిన ఈ సర్వేలో 136 మంది సీఈవోలు పాల్గొన్నారు. ‘అధిక ద్రవ్యోల్బణం, కఠిన పరపతి విధానం, ముడి సరుకుల ధరల పెరుగుదల, అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి వంటి అనేక సవాళ్లను ఇటు దేశీయంగా అటు ఎగుమతులపరంగా భారతీయ పరిశ్రమ గట్టిగా ఎదుర్కొనడంతో పాటు వ్యాపారాల పనితీరుపై సానుకూల అంచనాలను సీఈవోల సర్వే ప్రతిఫలిస్తోంది‘ అని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ పేర్కొన్నారు.  

దీని ప్రకారం..
► స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 7–8 శాతం స్థాయిలో ఉంటుందని 57 శాతం మంది సీఈవోలు తెలిపారు. 7 శాతం లోపే ఉంటుందని 34 శాతం మంది అంచనా వేశారు.
► దాదాపు సగం మంది చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌లు (49 శాతం) ప్రథమార్ధంలో (హెచ్‌1) గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ మెరుగ్గా ఉంటుందని పేర్కొన్నారు.
► ద్రవ్యోల్బణం ఎగుస్తుండటంతో ద్రవ్య పరపతి విధానాన్ని కఠినతరం చేస్తారనే అంచనాలు ఉన్నప్పటికీ ప్రథమార్ధంలో పరిస్థితులు మెరుగ్గానే ఉండగలవన్నది సీఈవోల అభిప్రాయం.
► ప్రథమార్ధంలో ఆదాయాల వృద్ధి 10–20 శాతం స్థాయిలో ఉండొచ్చని 44 శాతం మంది సీఈవోలు అంచనా వేశారు. 32 శాతం మంది 20 శాతం పైగా ఉండొచ్చని తెలిపారు.
► లాభాల వృద్ధి 10 శాతం పైగా ఉంటుందని 45 శాతం మంది, దాదాపు 10 శాతం వరకూ ఉంటుందని 40 శాతం మంది సీఈవోలు అంచనా వేశారు.
► ముడి వస్తువుల రేట్ల పెరుగుదలతో హెచ్‌1లో తమ లాభాలపై 5–10 శాతం మేర ప్రతికూల ప్రభావం పడుతుందని 46 శాతం మంది, 10–20 శాతం స్థాయిలో ఉండొచ్చని 28 శాతం మంది చెప్పారు.
► ముడి వస్తువుల ధరల పెరుగుదలతో ఇటీవలి కాలంలో తమ ఉత్పత్తుల రేట్లు పెంచినట్లు 43 శాతం మంది వెల్లడించారు. ఆ భారాన్ని తామే భరించడమో లేదా సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం ద్వారా వ్యయాలను తగ్గించుకోవడమో చేసినట్లు మిగతా వారు పేర్కొన్నారు.
► హెచ్‌1లో ద్రవ్యోల్బణం 7–8 శాతం స్థాయిలో ఉంటుందని దాదాపు సగం మంది (48 శాతం) అంచనా వేస్తున్నారు.
► ముడి వస్తువుల రేట్ల పెరుగుదల, ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిళ్లు నెలకొన్నందున రాష్ట్రాల ప్రభుత్వాలు .. ఇంధనాలపై వ్యాట్‌ను తగ్గించాలని మూడొంతుల మంది సీఈవోలు
అభిప్రాయపడ్డారు.
► ఎగుమతులపరంగా చూస్తే రూపాయి మారకం విలువ మరింత పడిపోతుందని, డాలర్‌తో పోలిస్తే 80 స్థాయికి పైగా పతనం కావచ్చని మెజారిటీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌లు అభిప్రాయపడ్డారు. ఫలితంగా ఎగుమతులపరంగా తమకు ప్రయోజనం చేకూరుతుందని 55 శాతం మంది తెలిపారు.
► దిగుమతులపరంగా చూస్తే మాత్రం హెచ్‌1లో ముడి వస్తువుల సరఫరాపై ఒక మోస్తరు ప్రభావం పడొచ్చని 50 శాతం మంది సీఈవోలు
పేర్కొన్నారు.
► ఇటీవలి భౌగోళిక రాజకీయ పరిణామాలు, కోవిడ్‌ సంబంధ లాక్‌డౌన్‌ల ప్రభావాల కారణంగా సరఫరాలపరంగా స్వల్ప సవాళ్లు ఎదుర్కొన్నట్లు 30 శాతం మంది సీఈవోలు చెప్పారు. అయితే, తమ అవసరాల కోసం చైనాపై ఆధారపడటం కొంత తగ్గించుకున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement