దీపావళి: చైనాకు 40 వేల కోట్ల మేర నష్టం!

CAIT Diwali Sales Cross Rs 72000 Crore Huge Loss For China Amid Boycott - Sakshi

చైనాకు 40 వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది: సీఏఐటీ

న్యూఢిల్లీ: దీపావళి సందర్భంగా దేశ వ్యాప్తంగా సుమారు 72 వేల కోట్ల మేర అమ్మకాలు జరిగినట్లు ది కాన్ఫెడెరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌(సీఏఐటీ) వెల్లడించింది. దేశంలోని ప్రధాన మార్కెట్ల(పట్టణాల) నుంచి సేకరించిన వివరాల ప్రకారం పండుగ నేపథ్యంలో ఈ మేరకు భారీ మొత్తంలో టర్నోవర్‌ జరిగిందని, దీంతో చైనాకు 40 వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. కాగా కరోనా వైరస్‌ వ్యాప్తి, తూర్పు లదాఖ్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా ఉత్పత్తులను బహిష్కరించాలంటూ అంబానీ, టాటా, అజీం ప్రేమ్‌జీ, మిట్టల్‌ తదితర దేశీయ పారిశ్రామిక దిగ్గజాలకు సీఏఐటీ గతంలో లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత సైనికులను పొట్టనబెట్టుకున్న డ్రాగన్‌ ఆర్మీ దురాగతాలను నిరసిస్తూ బ్యాన్‌ చైనా అంటూ ప్రచారం నిర్వహించిన ఈ ట్రేడ్‌బాడీ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఈ మేరకు.. ‘‘దేశంలోని 20 ప్రధాన వాణిజ్య పట్టణాల నుంచి సేకరించిన నివేదిక ప్రకారం దీపావళి పండుగ సందర్భంగా సుమారు 72 వేల కోట్ల మేర టర్నోవర్‌ జరిగింది.తద్వారా చైనా మార్కెట్‌కు 40 వేల కోట్ల నష్టం వాటిల్లింది. భవిష్యత్‌లోనూ ఇలాంటి మంచి ఫలితాలే లభిస్తాయని ఆశిద్దాం’’ అని పేర్కొంది. ఇక పండుగ నేపథ్యంలో ఎలక్ట్రానిక్‌ వస్తువులు, వంట సామాగ్రి, ఫర్నీచర్‌, వాల్‌హ్యాంగింగ్స్‌, బంగారం, ఆభరణాలు, ఫుట్‌వేర్‌, వాచ్‌లు, దుస్తులు, ఇంటి అలకంరణ సామాగ్రి, ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌, గిఫ్ట్‌ ఐటెంలు, స్వీట్లు తదితర వస్తువలు ఎక్కువగా అమ్ముడుపోయినట్లు వెల్లడించింది. (చదవండి: ఆర్‌సీఈపీపై సంతకాలు.. చైనా ప్రాబల్యం!)

కాగా ఈ ఏడాది జూన్‌లో గల్వాన్‌ లోయలో చైనా సైనికుల దురాగతానికి 20 మంది భారత జవాన్లు అమరులైన విషయం విదితమే. వాస్తవాధీన రేఖ యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నించిన డ్రాగన్‌ ఆర్మీని అడ్డుకునే క్రమంలో కల్నల్‌ సంతోష్‌ బాబు వీర మరణం పొందారు. ఈ నేపథ్యంలో చైనా వస్తువులను నిషేధించాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఇక సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో జాతీయ భద్రత, సమాచార గోప్యతకు భంగం కలిగే అవకాశాలున్న నేపథ్యంలో టిక్‌టాక్‌, వీచాట్‌ తదితర చైనీస్‌ యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించడంతో డ్రాగన్‌ కంపెనీలు భారీ నష్టాలు చవిచూశాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top