సేల్స్‌ రచ్చ మామూలుగా లేదు, ఎలక్ట్రిక్‌ కార్ల అమ్మకాల్లో నంబర్‌ వన్‌!

Byd Electric Car Sales Goes Top, Beats Tesla In 2022 - Sakshi

సాక్షి, బిజినెస్‌ డెస్క్‌: బిల్డ్‌ యువర్‌ డ్రీమ్స్‌.. మీ కలలను సాకారం చేసుకోండి. ఇదేదో ట్యాగ్‌లైన్‌ కాదు. ఓ చైనా ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ పేరు. సంక్షిప్త రూపం బీవైడీ. ఈ బీవైడీనే ఇప్పుడు అమెరికన్‌ ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజం టెస్లాను కలవరపెడుతోంది. అంతటి పెద్ద కంపెనీని కూడా డిస్కౌంట్ల బాట పట్టించింది. ఎలక్ట్రిక్‌ కార్ల అమ్మకాల్లో ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ కంపెనీగా నిల్చింది. ఇప్పుడు భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ మరింతగా విస్తరిస్తోంది. 

రెండు దశాబ్దాలుగా.. 
ప్రాథమికంగా రీచార్జబుల్‌ బ్యాటరీల ఫ్యాక్టరీగా బీవైడీ కంపెనీని వాంగ్‌ చౌన్‌ఫు 1995లో ప్రారంభించారు. ఆ తర్వాత ఆటోమొబైల్స్, మొబైల్‌ ఫోన్స్‌ పరికరాల విభాగాల్లోకి విస్తరించారు. ఆ క్రమంలోనే కార్ల తయారీ లైసెన్సు ఉన్న క్విన్‌చువాన్‌ ఆటోమొబైల్‌ కంపెనీని 2002లో కొనుగోలు చేసి దాన్ని 2003లో బీవైడీ ఆటో కంపెనీగా బీవైడీ మార్చింది. ప్రస్తుతం బీవైడీ కంపెనీలో బీవైడీ ఆటోమొబైల్, బీవైడీ ఎలక్ట్రానిక్‌ అని రెండు అనుబంధ సంస్థలు ఉన్నాయి.

బీవైడీ ఆటోమొబైల్‌.. ప్యాసింజర్‌ కార్లు, బస్సులు, ట్రక్కులు, ఎలక్ట్రిక్‌ సైకిళ్లు వంటి పూర్తి బ్యాటరీ ఎలక్ట్రిక్‌ వాహనాలు (బీఈవీ), ప్లగ్‌ ఇన్‌ హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలను (పీహెచ్‌ఈవీ) తయారు చేస్తోంది. పూర్తిగా ఎలక్ట్రిక్‌ వాహనాలపై దృష్టి పెట్టేందుకు గతేడాది మార్చి నుంచి పెట్రోల్‌ వాహనాలను నిలిపివేసింది. 2021 ఆఖరు నాటికి పీహెచ్‌ఈవీ, బీఈవీ విభాగంలో ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద కంపెనీగా ఎదిగింది. 2022లో దాదాపు 19 లక్షల పైగా విద్యుత్‌ వాహనాలు (హైబ్రిడ్‌ కూడా కలిపి) విక్రయించడం ద్వారా ఎలక్ట్రిక్‌ వాహనాల విక్రయంలో ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ సంస్థగా నిల్చింది. 

బఫెట్‌ పెట్టుబడులు.. 
మార్కెట్‌ క్యాప్‌పరంగా టెస్లా ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్‌ వాహనాల కంపెనీగా ఉండగా.. అమ్మకాలపరంగా మాత్రం బీవైడీ అగ్రస్థానాన్ని ఆక్రమించింది. టెస్లా మార్కెట్‌ వేల్యుయేషన్‌ 386 బిలియన్‌ డాలర్లుగా ఉండగా బీవైడీది సుమారు 100 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉంది. లాభాలు, ఆదాయాలపరంగా టెస్లా ఇంకా గ్లోబల్‌ లీడర్‌గానే ఉన్నప్పటికీ బీవైడీ వేగంగా దూసుకొస్తోంది.

యూరప్, ఆస్ట్రేలియా మొదలైన మార్కెట్లలోకి కూడా ఎగుమతులు మొదలుపెడుతోంది. అమెరికన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ గురు వారెన్‌ బఫెట్‌ .. టెస్లాలో కాకుండా చైనా కంపెనీ బీవైడీలో పెట్టుబడులు పెట్టారు. ఇతర ఎలక్ట్రిక్‌ వాహనాల కంపెనీలతో పోలిస్తే బీవైడీకి ఓ ప్రత్యేకత ఉంది. బ్యాటరీ, ఎలక్ట్రిక్‌ మోటార్, ఎలక్ట్రిక్‌ కంట్రోల్‌ అనే మూడు రకాల ఎన్‌ఈవీలకు సంబంధించిన టెక్నాలజీల్లోనూ నైపుణ్యం ఉంది.

ఇలా వినూత్న టెక్నాలజీల్లోనే కాకుండా ధరపరంగా కూడా టెస్లాకు బీవైడీ గట్టి పోటీ ఇస్తోంది. బీవైడీ కార్ల ధరలు చైనా మార్కెట్లో 30,000 డాలర్ల లోపే ఉంటుండగా, టెస్లా చౌకైన కారు మోడల్‌ 3 ప్రారంభ ధరే 37,800 డాలర్ల పైచిలుకు ఉంటోంది.  25,000 డాలర్ల రేంజిలో కారును కూడా తెస్తామంటూ టెస్లా ప్రకటించింది. 

భారత్‌లోనూ బీవైడీ జోరు.. 
2030 కల్లా భారత్‌లో అమ్ముడయ్యే ప్రతి మూడు కార్లలో ఒకటి ఎలక్ట్రిక్‌దే ఉంటుందనే అంచనాల నేపథ్యంలో మన మార్కెట్‌పై బీవైడీకి భారీ లక్ష్యాలే ఉన్నాయి. 2030 నాటికల్లా దేశీ ఈవీ మార్కెట్లో 40 శాతం వాటాను దక్కించుకోవాలని కంపెనీ నిర్దేశించుకుంది. 2007లోనే బీవైడీ ఇండియా విభాగం ఏర్పాటైంది. గతేడాది భారత్‌లో అటో 3 ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ, ఈ6 ఎలక్ట్రిక్‌ ఎంపీవీలను ప్రవేశపెట్టింది.

సీల్‌ పేరిట మరో కారును ఈ ఏడాది ప్రవేశపెడుతోంది. ఇప్పుడు విక్రయిస్తున్న కార్ల రేట్లు రూ. 29 లక్షల నుంచి ఉంటుండగా 700 కి.మీ. వరకు రేంజి ఉండే సీల్‌ రేటు దాదాపు రూ. 70 లక్షల స్థాయిలో ఉంటుందని అంచనా. దిగుమతి సుంకాల భారాన్ని తగ్గించుకునే క్రమంలో ప్రస్తుతం చెన్నైలోని ప్లాంటులో ఎలక్ట్రిక్‌ వాహనాలను సెమీ నాక్డ్‌–డౌన్‌ కిట్స్‌ (ఎస్‌కేడీ)లాగా అసెంబుల్‌ చేస్తోంది. రెండో దశలో డిమాండ్‌ను బట్టి పూర్తి స్థాయిలో ఇక్కడే అసెంబుల్‌ చేసే అవకాశాలనూ పరిశీలిస్తోంది. ప్రస్తుతం దాదాపు 20 డీలర్లు ఉండగా ఈ ఏడాది ఆఖరు నాటికి భారత్‌లో తమ డీలర్‌షిప్‌ల సంఖ్యను 53కి పెంచుకునే యోచనలో ఉంది. గతేడాది సుమారు 700 వాహనాలు విక్రయించగా ఈ ఏడాది ఏకంగా 15,000 పైచిలుకు అమ్మకాలను కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

 తెలుగు కనెక్షన్‌.. 
తెలుగు రాష్ట్రాల కంపెనీతో కూడా బీవైడీకి అనుబంధం ఉంది. మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రా (ఎంఈఐఎల్‌) అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌తో బీవైడీకి సాంకేతిక భాగస్వామ్యం ఉంది. బీవైడీ సాంకేతికత సహకారంతో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్‌ బస్సులను తయారు చేస్తోంది. ఇక భారత్‌లో సొంత ఉత్పత్తుల విస్తరణలో భాగంగా కంపెనీ హైదరాబాద్‌తో పాటు వైజాగ్, విజయవాడ తదితర ప్రాంతాల్లోనూ స్టోర్స్‌ ఏర్పాటు చేసింది. 

చదవండి: ShareChat Layoffs: ‘ఉద్యోగాల ఊచకోత’.. వందల మందిని తొలగిస్తున్న షేర్‌ చాట్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top