డబ్బే డబ్బు!!స్టాక్ మార్కెట్‌లోకి పెట్టుబడుల వరద!

Broking Industry Set For Record Rs28,000 Cr Revenue Says Icra - Sakshi

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)లో బ్రోకరేజీ పరిశ్రమ 30 శాతం వృద్ధిని సాధించనున్నట్లు రేటింగ్‌ దిగ్గజం ఇక్రా తాజాగా అభిప్రాయపడింది. దీంతో పరిశ్రమ టర్నోవర్‌ రూ.28,000 కోట్లకు చేరనున్నట్లు అంచనా వేసింది. అయితే వచ్చే ఏడాది(2022–23)లో వృద్ధి మందగించవచ్చని, ఔట్‌లుక్‌ మాత్రం నిలకడగానే ఉన్నట్లు తెలియజేసింది.

కరోనా మహమ్మారి తొలి దశ నీరసించిన 2020 జూన్‌ నుంచి మార్కెట్లు జోరందుకున్నట్లు పేర్కొంది.దీంతో రికార్డులు నెలకొల్పుతూ మార్కెట్లు సాగుతున్నట్లు తెలియజేసింది.కోవిడ్‌–19 దెబ్బకు కుప్పకూలిన 2020 మార్చితో పోలిస్తే స్టాక్‌ ఇండెక్సులు రెట్టింపుకంటే అధికంగా పెరిగినట్లు వెల్లడించింది. ఈ బాటలో చరిత్రాత్మక గరిష్టాలను తాకినట్లు ప్రస్తావించింది.సగటున 38 శాతం ఆదాయ వృద్ధి సాధిస్తున్న 18 బ్రోకరేజీలను పరిగణించి నివేదిక రూపొందించినట్లు ఇక్రా వెల్లడించింది. నివేదిక ప్రకారం.. 

రిటైలర్ల ఖుషీ 
2020 ఏప్రిల్‌ నుంచి స్టాక్‌ మార్కెట్లపట్ల కొత్త ఇన్వెస్టర్ల ఆసక్తి భారీగా పెరుగుతూ వచ్చింది. దీంతో డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య మూడు రెట్లు ఎగసింది.2020 మార్చిలో 408 లక్షలుగా నమోదైన డీమ్యాట్‌ ఖాతాలు గత(2021) మార్చికల్లా 551 లక్షలకు చేరాయి.ఈ బాటలో డిసెంబర్‌కల్లా ఈ సంఖ్య 806 లక్షలను తాకింది. వెరసి ఈ ఆర్థిక సంవత్సరంలో నికరంగా నెలకు 28.33 లక్షల చొప్పున కొత్త ఖాతాలు జమయ్యాయి. గతేడాది(2020–21)లో ఈ సంఖ్య 11.91 లక్షలుకాగా..2019–20లో నెలకు కేవలం 4.1 లక్షలు చొప్పున కొత్త డీమ్యాట్‌ ఖాతాలు జత కలిశాయి.అంటే గతేడాదితో పోల్చి చూసినా కొత్త ఖాతాల సంఖ్య రెట్టింపు వేగాన్ని అందుకుంది.  

సరికొత్త రికార్డ్‌ 
ప్రధానంగా రిటైల్‌ ఇన్వెస్టర్లు పెరగడంతో బ్రోకింగ్‌ పరిశ్రమ ఈ ఏడాది సరికొత్త రికార్డును నెలకొల్పనుంది. ఇందుకు భారీ లిక్విడిటీ పరిస్థితులు సైతం దన్నునిస్తున్నాయి. ఫలితంగా పరిశ్రమ టర్నోవర్‌ రూ.27,000–28,000 కోట్లకు చేరనుంది. ఇది 28–33 శాతం మధ్య వృద్ధికి సమానం. ఈ ఏడాది లావాదేవీల పరిమాణం ఊపందుకోవడంతోపాటు..సగటు పెట్టుబడి సైతం పెరగడంతో అధిక ఆదాయానికి దారి ఏర్పడింది. లావాదేవీల పరిమాణం ఆధారంగా బ్రోకింగ్‌ ఫీజు లభించే సంగతి తెలిసిందే. దీంతో రిటైల్‌ ఆధారిత బ్రోకరేజీలకు ఒక్కో క్లయింటుపై సగటు ఆదాయం 25 శాతం పుంజుకుని రూ.12,788కు చేరింది. గతేడాదిలో ఇది రూ.10,238 మాత్రమే.  

5–7 శాతమే 
వచ్చే ఏడాది బ్రోకరేజీ పరిశ్రమ నిలకడను చూపనుంది. ఆదాయం 5–7 శాతం బలపడే వీలుంది. దీంతో రూ.28,500–29,000 కోట్ల టర్నోవర్‌ నమోదుకావచ్చు. కాగా.. రిటైల్‌ ఇన్వెస్టర్ల జోరుతో ఈ ఏడాది తొలి 9 నెలల్లో ట్రేడింగ్‌ పరిమాణం సైతం 179 శాతం జంప్‌ చేసింది. రోజువారీ సగటు టర్నోవర్‌ 126 శాతం ఎగసి రూ. 63.07 లక్షల కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2019–20)లో ఇది 14.39 లక్షల కోట్లు మాత్రమే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top