ఎస్‌బీఐ లైఫ్‌ నుంచి బీఎన్‌పీ పరిబాస్‌ ఎగ్జిట్‌!

BNP Paribas may exit from SBI life insurance - Sakshi

5.2 శాతం వాటా విక్రయానికి సన్నాహాలు

రెండు దశాబ్దాల భాగస్వామ్యానికి తెర?

డీల్‌‌ విలువ రూ. 4,312 కోట్లు

గత రెండేళ్లుగా వాటా విక్రయిస్తున్న బీఎన్‌పీ

ముంబై: దేశీ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌(ఎస్‌బీఐ), గ్లోబల్‌ దిగ్గజం బీఎన్‌పీ పరిబాస్‌ కార్డిఫ్‌ మధ్య రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న భాగస్వామ్యానికి తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో మిగిలిన 5.2 శాతం వాటాను బీఎన్‌పీ పరిబాస్‌ కార్డిఫ్‌ విక్రయించేందుకు నిర్ణయించినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. బ్లాక్‌ డీల్‌ ద్వారా ఈ వాటాను విక్రయించే యోచనలో ఉన్నట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రీత్యా 5.2 శాతం వాటాకు రూ. 4,312 కోట్లు లభించే వీలున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేరు శుక్రవారం రూ. 863 వద్ద ముగిసింది. గత నెల రోజుల్లో ఈ షేరు 8 శాతం లాభపడింది.

విక్రయాల బాట
దేశీ భాగస్వామ్య సంస్థ ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో వాటాను గత రెండేళ్లుగా యూరోపియన్‌ దిగ్గజం బీఎన్‌పీ పరిబాస్‌ కార్డిఫ్‌ విక్రయిస్తూ వస్తోంది. 2019 జూన్‌లో ఎస్‌బీఐ లైఫ్‌లో 2.5 శాతం వాటాను బీఎన్‌పీ పరిబాస్‌ రూ. 1,625 కోట్లకు విక్రయించింది. ఈ బాటలో 2019 మార్చిలో 5 శాతం వాటాను రూ. 2,889 కోట్లకు అమ్మివేసింది. తదుపరి మరో 9.2 శాతం వాటాను రూ. 4,751 కోట్లకు విక్రయించింది. ఆఫర్‌ ఫర్ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) కంటే బ్లాక్‌డీల్‌ ద్వారా వాటా విక్రయాన్ని వేగంగా చేపట్టవచ్చని ఈ సందర్భంగా మార్కెట్‌ నిపుణులు ప్రస్తావించారు. ప్రస్తుతం ఎస్‌బీఐ లైఫ్‌లో ప్రమోటర్‌గా ఉన్న బీఎన్‌పీ పరిబాస్‌ కార్డఫ్‌కు 5.2 శాతం వాటా మాత్రమే ఉంది. మరోవైపు ఈ జేవీలో ప్రమోటర్‌గా బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ 55 శాతం వాటాను కలిగి ఉంది.

5 శాతం మించితే
కంపెనీ ఈక్విటీలో 5 శాతం వాటాకు మించి విక్రయం, కొనుగోలు లేదా తనఖా చేపట్టదలిస్తే.. ఇందుకు ముందస్తు అనుమతి తీసుకోవలసి ఉంటుందంటూ బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ 2020 జులైలో స్పష్టం చేసింది. కాగా.. బీఎన్‌పీ పరిబాస్‌ వాటా విక్రయ అంశంపై ఎస్‌బీఐ లైఫ్‌‌.. మార్కెట్‌ అంచనాలపై తాము స్పందించబోమంటూ వ్యాఖ్యానించింది. 

జేవీ బ్యాక్‌గ్రౌండ్‌
ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ 2001లో భాగస్వామ్య సంస్థ(జేవీ)గా ఏర్పాటైంది. పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌, బీఎన్‌పీ పరిబాస్‌ కార్డిఫ్‌ ప్రమోటర్లు కాగా.. 2017 అక్టోబర్‌లో స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగానికల్లా బీమా రంగ మార్కెట్లో 11.7 శాతం వాటాను కలిగి ఉంది. బీమా రంగ గ్లోబల్‌ కంపెనీ బీఎన్‌పీ పరిబాస్‌ కార్డిఫ్‌ 33 దేశాలలో కార్యకలాపాలు విస్తరించింది. 2019లో 29.8 బిలియన్‌ యూరోల స్థూల రిటెన్‌ ప్రీమియంల విలువను సాధించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top