రూ.10 వేల కోట్ల ఆదాయంపై కన్నేసిన బ్లూస్టార్‌

Blue Star eyes Rs 10k cr revenue in medium term to enter western countries - Sakshi

న్యూఢిల్లీ: ఎయిర్‌ కండిషనింగ్, వాణిజ్యపర రిఫ్రిజిరేటర్ల తయారీ దిగ్గజం బ్లూ స్టార్‌.. మధ్య కాలంలో తన ఆదాయాన్ని రూ.10,000 కోట్లకు పెంచు కోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఉత్తర అమెరికా, ఐరోపా మార్కెట్లలోకి ప్రవేశించాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. ‘తదుపరి దశ వృద్ధిలో భాగంగా అంతర్జాతీయంగా ప్రధాన కంపెనీగా బ్లూస్టార్‌ మారుతుంది.

మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, దక్షిణాసియా ప్రాంతాలలో మరింత విస్తరణ, వినూత్న ఉత్పత్తులు, పరిష్కారాల పరిచయంతో  తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటామని బ్లూస్టార్‌ వెల్లడించింది. పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకుంటాం. వ్యయ నియంత్రణ చేపడతాం. భారతదేశం మాతృ కేంద్రంగా కొనసాగుతుంది. ఏసీలు, రిఫ్రిజిరేషన్‌కు సంబంధించి అన్ని విభాగాల్లో బ్లూ స్టార్‌ ప్రధాన బ్రాండ్‌గా ఉండడానికి కృషి చేస్తుంది. ఏసీలు, రిఫ్రిజిరేషన్‌ ఉత్పత్తుల తయారీలో ముఖ్య కేంద్రంగా భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోంది’ అని సంస్థ వైస్‌ ఛైర్మన్, ఎండీ వీర్‌ ఎస్‌ అద్వానీ తెలిపారు.

కాగా 2021-22లో బ్లూ స్టార్‌ రూ.6,081 కోట్ల టర్నోవర్‌ సాధించింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో 20 ఎకరాల్లో రూమ్‌ ఏసీల తయారీ కేంద్రం స్థాపిస్తోంది. ఈ కేంద్రం కోసం బ్లూ స్టార్‌ రూ.550 కోట్లు ఖర్చు చేస్తోంది. పూర్తి వార్షిక తయారీ సామర్థ్యం 12 లక్షల యూనిట్లుగా ఉండనుంది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top