
పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల మధ్య మారుతీ సుజుకి(Maruti Suzuki) తన కార్లపై ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కంపెనీ పాపులర్ మోడల్ అయిన బాలెనో(Baleno) ధరను పెంచుతున్నట్లు మారుతీ సుజుకి నిర్ణయం తీసుకుంది. వేరియంట్‌ను అనుసరించి రూ.9,000 ధరలో పెరుగుదల ఉంటుందని స్పష్టం చేసింది. సవరించిన ధరలతో బాలెనో రూ.6.70 లక్షల నుంచి ప్రారంభమై రూ.9.92 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
ఇదీ చదవండి: బంగారం ధర త్వరలో ‘లకారం’! తులం ఎంతంటే..
బాలెనో సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. వీటిలో పెట్రోల్, సీఎన్‌జీ మోడళ్లు కూడా ఉన్నాయి. ఈ కారు 88 హెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుందని కంపెనీ తెలిపింది. 113 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఎంటీ) లేదా 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఏఎంటీ)తో వస్తుంది. ఎంటీ కలిగిన పెట్రోల్ వేరియంట్లు లీటరుకు 22.35 కిలోమీటర్లు, ఏఎంటీతో ఉన్న కార్లు 22.94 కిలోమీటర్ల మైలేజీని అందిస్తాయని కంపెనీ పేర్కొంది. సీఎన్జీ ఆధారిత వర్షన్ కిలోకు 30.61 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని చెప్పింది. ధరల పెరుగుదల డెల్టా ఏజీస్, జీటా ఏజీఎస్, ఆల్ఫా ఏజీఎస్ వేరియంట్లపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని మోటార్ నిపుణులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment