
కొచ్చి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తూ నూతన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తోందని దేవులపల్లి అమర్ అన్నారు. శనివారం కొచ్చిలోని లేమెరిడియన్ లో జరిగిన మల్నాడు టీవీ బిజినెస్ కాంక్లేవ్ - ఇండియా దర్శన్ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డ్స్ 2022 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ నాయకత్వంలో ఏపీలో సింగిల్ విండో పద్ధతిలో ఆకర్షణీయమైన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. పారదర్శకంగా ఈ విధానం అమలవుతున్నందున పారిశ్రామికవేత్తలు ఏపీలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారని వివరించారు. అదేవిధంగా రైతులు, ఉత్పత్తిదారులకు లాభం కలిగే విధంగా సేంద్రియ వ్యవసాయాన్ని ఏపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అమర్ చెప్పారు.
మల్నాడు టీవీ మేనేజింగ్ ఎడిటర్ ఆర్ జయేష్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అందిస్తున్న సేవలు అద్భుతమని అభినందించారు. జర్నలిజం రంగంలో చేసిన సేవలకు టీవీ ఇండియా దర్శన్ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు 2022 పురస్కారాన్ని అమర్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు వీబీ రాజన్, అవార్డుల కమిటీ జ్యూరీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.