'తప్పంతా మీదే' ఫ్యూచర్‌పై అమెజాన్‌ ఆగ్రహం!

Amazon Letter To Independent Directors Of Future Retail - Sakshi

న్యూఢిల్లీ: రుణ సవాళ్లు ఎదుర్కొంటున్న ఫ్యూచర్‌ రిటైల్‌ స్వతంత్ర డైరెక్టర్లు తమ చట్టబద్ధ బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైనట్లు ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తాజాగా ఆరోపించింది. ఇది దేశంలోని కార్పొరేట్‌ పాలనకుగల బాధ్యత, పారదర్శకత, నిజాయితీలపై పలు ప్రశ్నలకు తావిస్తున్నదని వ్యాఖ్యానించింది. 

కంపెనీ స్వతంత్ర డైరెక్టర్‌కు రాసిన లేఖలో అమెజాన్‌ పలు అభ్యంతరాలు లేవనెత్తింది. లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్‌ బిజినెస్‌ను రిలయన్స్‌కు బదిలీ చేసేందుకు ప్రయత్నించడంలో ఫ్యూచర్‌ గ్రూప్‌ న్యాయపరమైన ఆదేశాల ఉల్లంఘనకు తెరతీసిందంటూ ఆరోపించింది. 2020 ఆగస్ట్‌లో ఫ్యూచర్‌ గ్రూప్‌ రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌తో రూ. 24,713 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. 

దీనిలో భాగంగా రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్‌ విభాగాలతో కలిపి 19 కంపెనీలను విక్రయించేందుకు డీల్‌ కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందానికి విరుద్ధంగా అమెజాన్‌ సింగపూర్‌ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ను ఆశ్రయించింది. అంతేకాకుండా అమెజాన్, ఫ్యూచర్‌ గ్రూప్‌ వివాదం సుప్రీం కోర్టు, ఢిల్లీ హైకోర్టు, ఎన్‌సీఎల్‌టీ తదితరాలచెంతకు చేరడంతో సెక్యూర్డ్‌ రుణదాతలు డీల్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో ఒప్పందానికి చెక్‌ పడింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top