అమెజాన్‌ చేతికి ఎంజీఎం

Amazon buys MGM to add catalogue to Prime Video service - Sakshi

డీల్‌ విలువ 8.45 బిలియన్‌ డాలర్లు

వీడియో స్ట్రీమింగ్‌ సర్వీసులు మరింత పటిష్టం

న్యూయార్క్‌: జేమ్స్‌బాండ్‌ సినిమాల నిర్మాణ దిగ్గజం ఎంజీఎంను ఆన్‌లైన్‌ షాపింగ్‌ దిగ్గజం అమెజాన్‌ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 8.45 బిలియన్‌ డాలర్లు వెచ్చిస్తోంది. తద్వారా తమ వీడియో స్ట్రీమింగ్‌ సర్వీసులను మరింత పటిష్టం చేసుకోవాలని యోచిస్తోంది. నిత్యావసరాల చెయిన్‌ హోల్‌ ఫుడ్స్‌ను 2017లో 14 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసిన తర్వాత అమెజాన్‌కి ఇదే అతి పెద్ద డీల్‌. మీడియా రంగంలో నెట్‌ఫ్లిక్స్, డిస్నీప్లస్‌ వంటి స్ట్రీమింగ్‌ సేవల సంస్థలతో పోటీపడేందుకు అమెజాన్‌కి ఈ ఒప్పందం ఉపయోగపడనుంది.

అమెజాన్‌ ఇప్పటికే ప్రైమ్‌ వీడియో పేరిట స్ట్రీమింగ్‌ సర్వీసులు అందిస్తోంది. దీనికి నికరంగా ఎంత మంది యూజర్లు ఉన్నారన్నది వెల్లడించనప్పటికీ .. అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యత్వం ఉన్న దాదాపు 20 కోట్ల మందికి ఇది అందుబాటులో ఉంటోంది. ప్రైమ్‌ వీడియోతో పాటు ఐఎండీబీ టీవీ పేరుతో ఉచిత స్ట్రీమింగ్‌ సర్వీస్‌ కూడా అమెజాన్‌ నిర్వహిస్తోంది. ఎంజీఎం కొనుగోలుతో రాకీ, రోబోకాప్, పింక్‌ పాంథర్‌ వంటి పలు హిట్‌ సినిమాలు, షోలు కంపెనీ చేతికి దక్కుతాయి. అలాగే ఎపిక్స్‌ అనే కేబుల్‌ చానల్‌ కూడా లభిస్తుంది. త్వరలో విడుదలయ్యే జేమ్స్‌ బాండ్‌ మూవీ.. ‘నో టైమ్‌ టు డై’ కూడా ఎంజీఎం నిర్మించింది.
 

మూకీ యుగం నుంచి ఎంజీఎం..
గర్జించే సింహం లోగోతో మూకీ సినిమాల సమయం నుంచి సినీ ప్రేక్షకులకు ఎంజీఎం స్టూడియో చిరపరిచితం. 1924లో దీన్ని ఏర్పాటు చేశారు. సింగింగ్‌ ఇన్‌ ది రెయిన్‌ వంటి అనేక క్లాసిక్‌ సినిమాలతో పాటు ఇటీవలి షార్క్‌ ట్యాంక్, ది రియల్‌ హౌస్‌వైవ్స్‌ ఆఫ్‌ బెవర్లీ హిల్స్‌ వంటి రియాలిటీ టీవీ షోలను ఎంజీఎం నిర్మించింది. మరోవైపు అమెజాన్‌కి కూడా సొంత స్టూడియో ఉన్నప్పటికీ ఫలితాలు మిశ్రమంగా ఉంటున్నాయి. మార్వెలస్‌ మిసెస్‌ మెయిజెల్, ఫ్లీబ్యాగ్‌ వంటి షోలు అవార్డులు గెల్చుకున్నప్పటికీ చాలా మటుకు సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా పడ్డాయి. 1995లో ఏర్పాటైన అమెజాన్‌ ప్రస్తుతం 1.6 లక్షల కోట్ల డాలర్ల దిగ్గజంగా ఎదిగింది. ఆన్‌లైన్‌ అమ్మకాల నుంచి అంతరిక్షంలో ఉపగ్రహాల దాకా పంపిస్తోంది. దీంతో కంపెనీ గుత్తాధిపత్యాన్ని తగ్గించడంపై అమెరికా దృష్టి పెడుతోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top