హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అందుబాటు ధరల్లో ఉత్పత్తులన్నీ ఒకే చోట లభించేలా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌లో అంతర్భాగంగా ఉన్న అమెజాన్ బజార్‌కి (Amazon Bazaar) సంబంధించి అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. వార్షిక ప్రాతిపదికన ఆర్డర్లు నాలుగు రెట్లు పెరిగినట్లు అమెజాన్ బజార్ హెడ్ సమీర్ లాల్వానీ తెలిపారు. హైదరాబాద్‌లో కొత్త కస్టమర్ల చేరిక నాలుగు రెట్లు పెరగ్గా, విజయవాడ, గుంటూరు, వరంగల్ తదితర నగరాలు కూడా ముందు వరుసలో ఉన్నట్లు వివరించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 1,200 మంది పైచిలుకు విక్రేతలు ఉన్నట్లు తెలిపారు. బజార్‌లో రూ. 99 నుంచి రూ. 600 ధర శ్రేణిలో మూడు కోట్లకు పైగా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని, దేశవ్యాప్తంగా 30,000 పైచిలుకు విక్రేతలు ఉన్నారని పేర్కొన్నారు. మహిళల ఫ్యాషన్, గృహోపకరణలు, కన్జూమర్ ఎల్రక్టానిక్స్ మొదలైన కేటగిరీల్లో మరిన్ని ఉత్పత్తులను అందుబాటులోకి తేవడం, ద్వితీయ.. తృతీయ శ్రేణి పట్టణాల్లోకి మరింత విస్తరణపై దృష్టి పెడుతున్నట్లు లాల్వానీ చెప్పారు.
డెలివరీ అసోసియేట్స్‌కి హెల్త్ కవరేజీ
మరోవైపు, దేశవ్యాప్తంగా 90,000 మంది డెలివరీ అసోసియేట్స్‌కి హెల్త్ కవరేజీని విస్తరిస్తున్నట్లు అమెజాన్ ఇండియా డైరెక్టర్ (ఆపరేషన్స్) సలీమ్ మెమన్ తెలిపారు. రూ. 1.5 లక్షల వరకు మెడిక్లెయిమ్, రూ. 10,000 వరకు ఓపీడీ ప్రయోజనాలు, రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా కవరేజీ మొదలైనవి వీటిలో ఉన్నట్లు వివరించారు. డెలివరీ అసోసియేట్స్ కోసం ఉచిత హెల్త్ క్యాంపులు కూడా నిర్వహించినట్లు తెలిపారు. అసోసియేట్స్ సంక్షేమంపై రూ. 2,800 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా వీటిని చేపట్టినట్లు మెమన్ చెప్పారు.


