
చేయాలనే తపన, ఆలోచించే శక్తి ఉంటే ఎవరైనా అద్భుతాలు చేస్తారు. చదువుకునే వయసులోనే సొంతంగా కోడింగ్ నేర్చుకోవడమే కాకుండా.. కోట్ల విలువైన కంపెనీ స్థాపించింది. ఇంతకీ ఈ ఘనత సాధించినది ఎవరు?, వారు స్థాపించిన కంపెనీ ఏది అనే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో చూసేద్దాం.
భారతదేశంలో పుట్టిన 'ప్రాంజలి అవస్థి' (Pranjali Awasthi) చిన్నప్పుడే తన తండ్రి ఉపయోగించే కంప్యూటర్ చూస్తూ.. దాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకుంది. ఆ తరువాత కోడింగ్ ఎలా రాయాలో నేర్చుకుని.. ఏడేళ్ల ప్రాయానికే సొంతంగా కోడింగ్ రాసింది.

11 సంవత్సరాల వయసులో ప్రాంజలి అవస్థి.. తన కుటుంబంతో అమెరికాలోని ఫ్లోరిడాకు మారింది. అక్కడే కంప్యూటర్ సైన్స్ అండ్ కాంపిటీటివ్ మ్యాథ్స్ కోర్సుల్లో చేరింది. ఆ తరువాత 13 ఏళ్ల వయసుకే ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి చెందిన న్యూరల్ డైనమిక్స్ ఆఫ్ కంట్రోల్ ల్యాబ్‌లో ఇంటర్న్‌షిప్ చేయడం మొదలుపెట్టింది. ఆ సమయంలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) గురించి తెలుసుకుంది.

ఏఐ సాయంతో చాలా పనులను సులభంగా చేయవచ్చని గ్రహించిన ప్రాంజలి.. డెల్వ్.ఏఐ (Delv.AI) ప్రారంభించింది. ఈ కంపెనీ రూ. 3.5 కోట్లతో.. ముగ్గురు ఉద్యోగులతో మొదలైంది. ప్రస్తుతం దీని విలువ రూ.100 కోట్ల కంటే ఎక్కువ. ఈ సంస్థలో పదిమంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతం ప్రాంజలి అమెరికాలోని జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. ఆమె 'చాట్‌జీపీటీ ఇన్ హ్యాండ్' అనే కొత్త ప్రాజెక్ట్‌లో కూడా పనిచేస్తోంది. ఇది ఒక ఏఐ అసిస్టెంట్. ఇది మాట్లాడటమే కాకుండా మీ కోసం కూడా పని చేయగలదని అవస్థి చెబుతోంది.
ఇదీ చదవండి: జీతం వచ్చిన ఐదు నిమిషాలకే ఉద్యోగి రాజీనామా: హెచ్ఆర్ ఏమన్నారంటే?