హైడ్రోజన్‌ ఉత్పత్తిలోకి అదానీ 

Adani Group To Invest 1. 5 lakh Crores In Renewable Energy - Sakshi

పునరుత్పాదక ఇంధనంపై భారీ పెట్టుబడులు 

దశాబ్ద కాలంలో రూ. 1.5 లక్షల కోట్లకు రెడీ 

ప్రపంచంలోనే చౌకగా గ్రీన్‌ ఎలక్ట్రాన్‌ తయారీ!

న్యూఢిల్లీ: మౌలిక సదుపాయాల దిగ్గజం అదానీ గ్రూప్‌ తాజాగా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి అధిక ప్రాధాన్యతను ఇవ్వనున్నట్లు తెలియజేసింది. ఇందుకు అనుగుణంగా రానున్న పదేళ్ల కాలంలో 20 బిలియన్‌ డాలర్లను(సుమారు రూ. 1.5 లక్షల కోట్లు) ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ వెల్లడించారు. తద్వారా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, విడిభాగాలు, ప్రపంచంలోనే చౌకైన గ్రీన్‌ ఎలక్ట్రాన్‌ తయారీని చేపట్టనున్నట్లు తెలియజేశారు. పోర్టుల నుంచి ఇంధనం వరకూ బిజినెస్‌లను నిర్వహిస్తున్న అదానీ గ్రూప్‌ రానున్న నాలుగేళ్లలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని మూడు రెట్లు పెంచాలని చూస్తున్నట్లు తెలియజేశారు. పర్యావరణ అనుకూల హైడ్రోజన్‌ ఉత్పత్తి, అన్ని డేటా సెంటర్లకు పునరుత్పాదక ఇంధన సరఫరా, 2025కల్లా సొంత పోర్టులనుంచి కర్బనాల విడుదలను పూర్తిగా తొలగించడం వంటి ప్రణాళికలున్నట్లు వివరించారు.  

75 శాతం వరకూ..: జేపీ మోర్గాన్‌ ఇండియా పెట్టుబడిదారుల సదస్సులో ప్రసంగించిన గౌతమ్‌ అదానీ 2025వరకూ మొత్తం పెట్టుబడి వ్యయాల్లో 75 శాతాన్ని పర్యావరణ అనుకూల టెక్నాలజీలపైనే వెచ్చించనున్నట్లు స్పష్టం చేశారు. ఇటీవల పారిశ్రామిక దిగ్గజం ముకేశ్‌ అంబానీ సైతం రానున్న మూడేళ్లలో శుద్ధ విద్యుదుత్పత్తి, హైడ్రోజన్‌ ఇంధనంపై 10 బిలియన్‌ డాలర్లు(రూ. 75,000 కోట్లు) వెచ్చించనున్నట్లు పేర్కొన్న నేపథ్యంలో అదానీ ప్రణాళికలకు ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో కొన్నేళ్లుగా పునరుత్పాదక విభాగంపై దృష్టి పెట్టిన అదానీ గ్రూప్‌తో ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రత్యక్షంగా పోటీ పడనున్నట్లు పరిశ్రమవర్గాలు వ్యాఖ్యానించాయి. దశాబ్ద కాలంలో పునరుత్పాదక ఇంధనంలో భాగంగా కిలో హైడ్రోజన్‌ను 1 డాలరుకే తయారు చేయనున్నట్లు ముకేశ్‌ ప్రకటించిన విషయం విదితమే.

కోవిడ్‌ను ఎదుర్కొనడంలో భారత్‌ తీరు భేష్‌ 
కోవిడ్‌–19 పరంగా తలెత్తిన పరిస్థితుల నిర్వహణ విషయంలో భారత్‌ భేషుగ్గానే పనిచేసిందని అదానీ అభిప్రాయపడ్డారు. ఈ అంశానికి సం బంధించిన విమర్శలు దేశ ప్రతిష్టను దెబ్బతీసే లా ఉండకూడదని ఆయన వ్యాఖ్యానించారు.  పత్రికా స్వేచ్ఛ, విమర్శల పేరుతో మీడియా పక్షపాత ధోరణితో వ్యవహరించకూడదని అదానీ హితవు పలికారు. అదానీ త్వరలో మీడియా రంగంలోకి అడుగుపెట్టనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top