అదంతా కుట్ర.. వాటిని చట్టపరంగా ఎదుర్కొంటాం: అదానీ గ్రూప్‌

Adani Group: Hindenburg Report Is Malicious Attempt To Damage Adani Enterprises - Sakshi

న్యూఢిల్లీ: ఖాతాల్లో, షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందంటూ తమ గ్రూప్‌ సంస్థలపై అమెరికన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ చేసిన ఆరోపణలపై అదానీ గ్రూప్‌ తీవ్రంగా స్పందించింది. తమ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకు హిండెన్‌బర్గ్‌ కుట్ర చేసిందని ఆరోపించింది. తాము తలపెట్టిన షేర్ల విక్రయాన్ని దెబ్బతీసేందుకే ‘నిర్లక్ష్యపూరితంగా’ వ్యవహరించినందుకు గాను హిండెన్‌బర్గ్‌ను చట్టపరంగా ఎదుర్కోనున్నట్లు వ్యాఖ్యానించింది. ‘ఎటువంటి పరిశోధన లేకుండా హిండెన్‌బర్గ్‌ రూపొందించిన దురుద్దేశపూరితమైన నివేదిక .. అదానీ గ్రూప్, మా షేర్‌హోల్డర్లు, ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావం చూపింది.

నివేదిక వల్ల భారతీయ స్టాక్‌ మార్కెట్లలో తలెత్తిన ఒడిదుడుకులు ఆందోళన కలిగించాయి‘ అని గ్రూప్‌ లీడ్‌  హెడ్‌ జతిన్‌ జలుంధ్‌వాలా ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్వెస్టర్లను, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు, అదానీ గ్రూప్‌ ప్రతిష్టను దెబ్బతీసేందుకు, ఫాలో ఆన్‌ ఇష్యూ (ఎఫ్‌పీవో)ను నాశనం చేసేందుకు ఒక విదేశీ సంస్థ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిన తీరు తీవ్రంగా కలవరపర్చిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత్, అమెరికా చట్టాల ప్రకారం హిండెన్‌బర్గ్‌పై తగు చర్యలు తీసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. అదానీ గ్రూప్‌ ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికతో గ్రూప్‌ కంపెనీల షేర్లు బుధవారం భారీగా పతనమైన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్‌ రూ. 20,000 కోట్ల ఎఫ్‌పీవోకు వస్తున్న తరుణంలో నివేదిక విడుదల కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

చదవండి: ఆధార్‌ కార్డ్‌లో మీ వివరాలు అప్‌డేట్‌ చేయాలా? ఇలా సింపుల్‌గా చేయండి!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top