యూనికార్న్‌ల హవా!

50 more startups in wings to be unicorns - Sakshi

ఈ ఏడాది మరో 50 సంస్థలకు చాన్స్‌

2021లో ఈ హోదాకు 46 స్టార్టప్‌లు

గతేడాది చివరికల్లా వీటి సంఖ్య 90కు

తాజా జాబితాలో ప్రాక్టో, నింజా కార్ట్, లివ్‌స్పేస్, పెప్పర్‌ఫ్రై

ముంబై/న్యూఢిల్లీ: ఈ కేలండర్‌ ఏడాది(2022)లోనూ స్టార్టప్‌ల హవా కొనసాగనుంది. కనీసం 50 సంస్థలు యూనికార్న్‌ హోదాను పొందే వీలున్నట్లు కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక అంచనా వేసింది. బిలియన్‌ డాలర్ల(సుమారు రూ. 7,500 కోట్లు) విలువను అందుకున్న స్టార్టప్‌లను యూనికార్న్‌గా పిలిచే విషయం విదితమే. ఇప్పటికే కనీసం 10 కోట్ల డాలర్ల నిధుల సమీకరణ రీత్యా భవిష్యత్‌లో యూనికార్న్‌లుగా ఆవిర్భవించగల స్టార్టప్‌ల జాబితాను పీడబ్ల్యూసీ రూపొందించింది. ఈ జాబితాలో ఖాటాబుక్, వాట్‌ఫిక్స్, ప్రాక్టో, నింజాకార్ట్,  ఇన్‌షార్ట్స్, ఈకామ్‌ ఎక్స్‌ప్రెస్, పెప్పర్‌ఫ్రై, లివ్‌స్పేస్‌ తదితర 50 స్టార్టప్‌లకు చోటు లభించింది.   

పెట్టుబడుల దూకుడు
దేశీయంగా స్టార్టప్‌లలో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. గత కేలండర్‌ ఏడాది(2021)లో అత్యంత అధికంగా 42 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను స్టార్టప్‌లు సమీకరించాయి. అంతక్రితం ఏడాది(2020)లో సమకూర్చుకున్న 11.5 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే ఇవి మూడు రెట్లుకంటే ఎక్కువకావడం విశేషం! దీంతో గతేడాది ఏకంగా 46 యూనికార్న్‌లు ఆవిర్భవించాయి. ఫలితంగా దేశంలో యూనికార్న్‌ల సంఖ్య 90కు చేరింది. 2021 దేశీ టెక్‌ యూనికార్న్‌ నివేదిక పేరుతో ఓరిస్‌ వెంచర్‌ పార్టనర్స్‌ రూపొందించిన వివరాలివి. వీటి ప్రకారం..

టాప్‌–3 ర్యాంక్‌
గతేడాది బిలియన్‌ డాలర్ల విలువను సాధించిన కంపెనీల జాబితాలో షేర్‌చాట్, క్రెడ్, మీషో, నజారా, మాగ్లిక్స్, ఎంపీఎల్, గ్రోఫర్స్‌(బ్లింకిట్‌), అప్‌గ్రాడ్, మమాఎర్త్, గ్లోబల్‌బీస్, అకో, స్పిన్నీ తదితరాలు చోటు సాధించాయి. దీంతో ప్రపంచంలోనే అమెరికా(487), చైనా(301) తదుపరి భారత్‌ 90 యూనికార్న్‌లతో మూడో ర్యాంకులో నిలిచింది. వెరసి 39 యూనికార్న్‌లకు ఆవాసమైన యూకేను నాలుగో ర్యాంకులోకి నెట్టింది. 60,000 స్టార్టప్‌లకు నిలయంకావడం ద్వారా భారత్‌ మూడోపెద్ద స్టార్టప్‌ ఎకోవ్యవస్థగల దేశంగా రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 13 యూనికార్న్‌లలో ఒకటి దేశీయంగానే ఊపిరి పోసుకుంటుండటం విశేషం!

ఉపాధి సైతం
భారీగా పుట్టుకొస్తున్న స్టార్టప్‌లు కొత్తతరహా సొల్యూషన్స్, సాంకేతికతలను అందించడమేకాకుండా భారీ స్థాయిలో ఉపాధి కల్పనకూ దారి చూపుతున్నాయి. ఫిన్‌టెక్, ఈకామర్స్, ఎస్‌ఏఏఎస్‌(సాస్‌) విభాగాల నుంచి అత్యధికంగా స్టార్టప్‌లు ఆవిర్భవిస్తున్నాయి. వీటి తదుపరి హెల్త్‌టెక్, ఎడ్‌టెక్, డీ2సీ, గేమింగ్, క్రిప్టో విభాగాలు నిలుస్తున్నాయి. అత్యధిక స్టార్టప్‌లకు బెంగళూరు నెలవుకాగా.. విలువలో 37.6 బిలియన్‌ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్‌ అగ్రపథాన్ని పొందింది.3.6 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను సమీకరించడం ద్వారా గత జూలైలో ఈ విలువను అందుకుంది. ఇక ఆరు నెలల్లోనే యూనికార్న్‌ హోదాను పొందిన సంస్థగామెన్సా బ్రాండ్స్‌ గుర్తింపు పొందింది. 2021 మే నెలలో 5 కోట్ల డాలర్లు సమకూర్చుకోవడంతో ఈ విలువను సాధించింది.

మహిళలూ..
యూనికార్న్‌ల వ్యవస్థాపకుల్లో 20 శాతం నాన్‌ ఇంజినీర్స్‌ కాగా.. దాదాపు 67 శాతం వరకూ ఐఐటీలు, ఐఐఎంలు, ఐఎస్‌బీ నుంచి ఒకరు లేదా అంతకుమించిన వ్యక్తులు ఉన్నట్లు ఓరిస్‌ వెంచర్స్‌ తాజా నివేదిక పేర్కొంది. జాబితాలో 13 మంది మహిళా వ్యవస్థాపకులకు చోటు లభించగా.. 2021లోనే 8 మంది ఈ హోదాను సాధించారు. వీరిలో ఫాల్గుణి నాయర్‌(నైకా), గజల్‌ కల్రా(రివిగో), రుచీ కల్రా(ఆఫ్‌బిజినెస్‌), దివ్యా గోకుల్‌నాథ్‌(బైజూస్‌), ఘజల్‌ అలఘ్‌(మమాఎర్త్‌), సరితా కటికనేని(జెనోటీ) తదితరులున్నారు.

డెకాకార్న్‌లుగా..
10 బిలియన్‌ డాలర్లు అంతకుమించిన విలువను అందుకున్న కంపెనీలను డెకాకార్న్‌లుగా వ్యవహరిస్తుంటారు. దేశీయంగా ఫ్లిప్‌కార్ట్, పేటీఎమ్, బైజూస్, ఓయో డెకాకార్న్‌లుగా ఆవిర్భవించాయి. గతేడాది అత్యధికంగా 11 స్టార్టప్‌లు ఐపీఓలను చేపట్టాయి. వీటిలో 8 యూనికార్న్‌లే! ఐపీవోల ద్వారా 7.16 బిలియన్‌ డాలర్లను సమకూర్చుకున్నాయి. వన్‌97 కమ్యూనికేషన్స్‌(పేటీఎమ్‌) కొత్త రికార్డ్‌ నెలకొల్పుతూ రూ. 18,300 కోట్లు(2.46 బిలియన్‌ డాలర్లు) అందుకుంది. మరోపక్క జొమాటో 14.8 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ క్యాప్‌(విలువ)తో చరిత్ర సృష్టించింది. ఈ బాటలో నైకా 13.5 బిలియన్‌ డాలర్లు, ఫ్రెష్‌వర్క్స్‌ 6.9 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువను సాధించడం విశేషం!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top