● కరువులోనూ నెలకు రూ.25 వేల నుంచి రూ.75 వేల వరకు రాబడి ● ఆదర్శంగా నిలుస్తున్న దుమ్ముగూడెం మండల రైతులు
దుమ్ముగూడెం: కొందరు రైతులు కూరగాయల పంటలు సాగుచేస్తూ నెలకు రూ.25వేల నుంచి రూ. 75 వేల వరకు సంపాదిస్తున్నారు. ఎల్‌నినో ప్రభా వంతో వర్షాల్లేక వరి, పత్తి పంటల సాగు సమస్యగా మారిన తరుణంలో కూరగాయలు, ఆకు కూరలను ఆధునిక పద్ధతుల్లో సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మండలంలోని సున్నంబట్టి గ్రామానికి చెందిన పసుపులేటి సుబ్బారావు, కన్నాపురం గ్రామానికి చెందిన అయ్యప్పరాజు శ్రీధర్, రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఇర్ప లక్ష్మణరావు తదితరులు తక్కువ నీటితో తక్కువ కాలంలో అందే కూరగాయల సాగు చేపడుతున్నారు.
సున్నంబట్టి గ్రామానికి చెందిన పసుపులేటి సుబ్బారావు ఎకరం భూమిలో బెండ, ఆనప, దోస, గోరుచిక్కుడు, కీరదోస, క్యాబేజీ, కాలీఫ్లవర్, వంకాయ, టమాటా, మిర్చి సాగు చేస్తున్నాడు. సుమారు రూ.60 వేల వరకు పెట్టుబడి ఖర్చయిందని రైతు తెలిపాడు. తన భార్య, కుమారుడితోపాటు మరో నలుగురు కూలీలు పని చేస్తున్నారని, అన్ని ఖర్చులు పోగా నెలకు రూ.25వేల వరకు ఆదాయం వస్తుందని వివరించాడు.
కన్నాపురం గ్రామానికి చెందిన రైతు అయ్యప్పరాజు శ్రీధర్ ఆరు ఎకరాల్లో కూరగాయలతోపాటు బంతి పూలు, మల్లెపూల సాగు చేపట్టాడు. రూ.3లక్షల వరకు పెట్టుబడి ఖర్చు కాగా, చేతికి పంట అందినప్పటి నుంచి నెలకు రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు ఆదాయం వస్తుందని రైతు తెలిపాడు. స్థానికం దుకాణాలతోపాటు సొంతగా ఇంటి దగ్గర కూరగాయలను విక్రయిస్తున్నానని, పూలు భద్రాచలం వంటి ప్రదేశాల్లో అమ్ముతున్నట్లు వివరించా డు. మార్కెటింగ్ అవకాశం ఉంటే ఇంకా ఆదాయం పెరుగుతుందని చెబుతున్నాడు.
రామచంద్రాపురానికి చెందిన ఇర్ప లక్ష్మణరావు తన ఇంటి ఆవరణలోని పొలంలో కాయగూరలు, ఆకుకూరల పంటలు వేసి పండించాడు. లక్ష్మీనగరం, ములకపాడు గ్రామాల్లో విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నాడు. పురుగు మందులు వాడకుండా పంటలు సాగు చేస్తున్నానని, నెలకు సుమారు రూ.15 వేల వరకు ఆదాయం వస్తుందని రైతు తెలిపాడు.


