ఉషూ టోర్నీలో 13 పతకాలు | - | Sakshi
Sakshi News home page

ఉషూ టోర్నీలో 13 పతకాలు

Nov 24 2026 12:18 AM | Updated on Nov 24 2026 12:18 AM

ఖమ్మం స్పోర్ట్స్‌: ఆదిలాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్స్‌ బాలబాలికల ఉషూ టోర్నీలో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో శిక్షణ పొందుతున్న 18మంది క్రీడాకారులు పోటీలకు హాజరుకాగా 13 పతకాలు సాదించారు. క్రీడాకారులు ఆరు బంగారు, నాలుగు రజత, మూడు కాంస్య పతకాలు సాదించగా ట్రెయినీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ పరాస్‌కుమార్‌, డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, కోచ్‌ పి.పరిపూర్ణాచారి అభినందించారు.

నేడు అధ్యాపకుల

ఆత్మీయ సమ్మేళనం

ఖమ్మం సహకారనగర్‌: ఉమ్మడి ఖమ్మం జిల్లా, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అతిథి అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనాన్ని మంగళవారం ఖమ్మంలో ఏర్పాటుచేశారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ బీజీఎన్‌ఆర్‌ కళాశాలలో ఈ సమావేశం జరుగుతుందని నిర్వాహకులు బూరుగు అప్పారావు, డాక్టర్‌ కొమ్ము జాల్‌ అభిజిత్‌ దేవ్‌, డాక్టర్‌ రాజిరెడ్డి తెలిపారు. గెజిటెడ్‌ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కడారు సురేందర్‌రెడ్డి పాల్గొననున్న ఈ సమావేశానికి అతిథి అధ్యాపకులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

ముచ్చర్లలో

కొత్తగా సబ్‌స్టేషన్‌

ట్రాన్స్‌కో నుంచి సాంకేతిక అనుమతులు జారీ

ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం జిల్లాలో మరో 132/33 కేవీ సబ్‌ స్టేషన్‌ ఏర్పాటుకు అనుమతి లభించింది. కామేపల్లి మండలం ముచ్చర్ల(కారేపల్లి ఎక్స్‌ రోడ్‌)లో సబ్‌స్టేషన్‌ ఏర్పాటుకు ట్రాన్స్‌కో నుంచి సాంకేతిక అనుమతి జారీచేశారు. ప్రస్తుతం కారేపల్లి, కామేపల్లి తదితర ప్రాంతాల్లోని సబ్‌స్టేషన్లకు ఇల్లెందు, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌లోని సబ్‌స్టేషన్ల నుంచి విద్యుత్‌ సరఫరా జరుగుతోంది. పెరుగుతున్న లోడ్‌ కారణంగా తరచూ లో ఓల్టేజీ సమస్య ఏర్పడుతుండడంతో ముచ్చర్లలో కొత్త సబ్‌ స్టేషన్‌ ఏర్పాటుకు ప్రతిపాదించగా అనుమతి లభించింది. ఈ సబ్‌స్టేషన్‌ ఏర్పాటుతో కారేపల్లి, కామేపల్లి, ఏన్కూరు మండలాల్లో విద్యుత్‌ సమస్య పరిష్కారమై నాణ్యమైన విద్యుత్‌ సరఫరా జరుగుతుంది. కాగా, సబ్‌ స్టేషన్‌ ఏర్పాటుకు మూడెకరాల స్థలాన్ని కలెక్టర్‌ ఇప్పటికే కేటాయించారని ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు.

ప్రభుత్వాస్పత్రిలో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స

పాల్వంచ: పాల్వంచ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో అత్యంత క్లిష్టమైన మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స వరుసగా విజయవంతంగా నిర్వహిస్తూ ఆస్పత్రి వైద్యులు అరుదైన రికార్డ్‌ సాధించారు. కొత్తగూడెంలోని రామాంజనేయ కాలనీకి చెందిన 60 ఏళ్ల కటికల నాగేంద్రమ్మ రెండేళ్లుగా కుడి మోకాలికి తీవ్రమైన నొప్పితో బాధపడుతోంది. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.ముక్కంటేశ్వరరావు పర్యవేక్షణలో ఆర్‌ఎంఓ సోమరాజుదొర సమన్వయంతో ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ వరుణ్‌కుమార్‌, అనస్థీషియన్‌ డాక్టర్‌ రాంప్రసాద్‌ బృందం నాగేంద్రమ్మకు టోటల్‌ నీ రీప్లేస్‌మెంట్‌ శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించారు. రూ.1.50 లక్షల వరకు ఖర్చయ్యే ఆపరేషన్‌ను ఉచితంగా పేదలకు అందించడం ఎంతో ఊరటనిస్తుంది. గతంలో ఇదే ఆస్పత్రిలో జరిగిన రెండు శస్త్ర చికిత్సలు విజయవంతం కావడంతో తాము నమ్మకంతో ఇక్కడికి వచ్చామని నాగేంద్రమ్మ కుటుంబ సభ్యులు తెలిపారు.

నలుగురు ప్రొబేషనరీ డీఎస్పీల కేటాయింపు

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లాస్థాయి ప్రాక్టికల్‌ శిక్షణలో భాగంగా నలుగురు ప్రొబేషనరీ డీఎస్పీలను జిల్లాకు కేటాయించినట్లు ఎస్పీ రోహిత్‌రాజు సోమవారం తెలిపారు. ప్రొబేషనరీ డీఎస్పీలు మామిళ్ల ఓంకార్‌ యాదవ్‌, సాయికుమార్‌ కన్నెకంటి, వినోద్‌కుమార్‌ ఎట్టం, ఎం.సింధూజలు సోమవారం నుంచే శిక్షణ పొందుతున్నారని పేర్కొన్నారు. శిక్షణలో భాగంగా పోలీస్‌శాఖ పనితీరు, క్షేత్రస్థాయి విధులు, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, పోలీస్‌ స్టేషన్ల నిర్వహణ తదితర అంశాలపై ప్రాక్టికల్‌ అనుభవాన్ని పొందనున్నారు. కాగా, ప్రొబేషనరీ డీఎస్పీలు ఎస్పీకి పూల మొక్క అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement