గ్రామ పంచాయతీ పాలకమండలి తీర్మానం
భద్రాచలంఅర్బన్: భద్రాచలంలోని బెల్ట్ షాపులను నిషేధిస్తూ మంగళవారం గ్రామ పంచాయతీ పాలకమండలి సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సర్పంచ్ పూనెం కృష్ణ, ఉపసర్పంచ్ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా బెల్ట్ షాపులను పూర్తిగా నిలిపివేయించాలని తీర్మానం చేశారు. ఈ క్రమాన ఎవరైనా బెల్ట్‌షాపులు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, నివాస ప్రాంతాల మధ్య ఖాళీ స్థలాల్లో పెరిగిన పిచ్చి మొక్కల తొలగింపునకు యజమానులకు నోటీసులు ఇవ్వాలని, ప్రధాన డ్రెయినేజీల్లో పూడిక తీత తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో వార్డు సభ్యులతో పాటు ఈఓ శ్రీనివాసరావు, ఉద్యోగులు పాల్గొన్నారు.


