కొత్తగూడెంఅర్బన్: భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్‌లో రైలు కిందపడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే డోర్నకల్ జీఆర్‌పీ ఎస్సై సురేష్ కథనం ప్రకారం.. తెల్లవారుజామున స్టేషన్‌కు చేరుకున్న మణుగూరు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద గుర్తు తెలియని వ్యక్తి పడడంతో మృతి చెందాడు. విషయం తెలిసిన రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా.. 40–45 ఏళ్ల వయస్సు వ్యక్తి ఒంటిపై బ్లూ కలర్ లుంగీ, నిలువు గీతల తెల్లరంగు చొక్కా ఉన్నట్లు తెలిపారు. మృతదేహాన్ని కొత్తగూడెం సర్వజన ఆస్పత్రికి తరలించామని, గుర్తించిన వారు ఫోన్ నంబర్ 87126 58606, 87126 58600, 94947 90619, 89194 30272లకు సమాచారం ఇవ్వాలన్నారు.
ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్..
పాల్వంచ: పొలంలో దుక్కి దున్నుతుండగా ట్రాక్టర్ బొల్తా పడడంతో డ్రైవర్ మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పట్టణ పరిధిలోని బంగారు రామస్వామి గుంపు నందు బంగారు బాబు వద్ద ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం సుకుమా జిల్లా కుంట మండలం కిష్టారంకు చెందిన కర్కా శ్రీను (26) ట్రాక్టర్ డ్రైవర్‌గా గత రెండేళ్లుగా పనిచేస్తున్నాడు. అయితే శనివారం శేఖరం బంజరకు చెందిన బానోతు భీముడుకి చెందిన వ్యవసాయ భూమిని దున్నడానికి శ్రీను ట్రాక్టర్‌తో వచ్చాడు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు అదుపు తప్పి ట్రాక్టర్ బొల్తా పడటంతో స్టీరింగ్ ఛాతిభాగంలో తగిలి అక్కడిక్కడే మృతి చెందాడు. గుర్తించిన స్థానికులు అతడిని బయటకు తీయగా.. మృతుడి తండ్రి జోగారావు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ నాగరాజు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
చికిత్స పొందుతున్న
యువకుడు..
అశ్వాపురం: వడదెబ్బకు గురైన మండల పరిధిలోని చింతిర్యాల కాలనీ గ్రామపంచాయతీ చింతిర్యాలగూడెం గ్రామానికి చెందిన పాయం నాగరాజు (31) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. ఈనెల 10న మండల పరిధిలోని అమెర్ధ గ్రామంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో పక్కనే ఉన్న వ్యక్తి అశ్వాపురం పీహెచ్‌సీకి అక్కడి నుంచి మణుగూరు, భద్రాచలం, ఆపై ఖమ్మంకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈక్రమంలో పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సీఐ అశోక్‌రెడ్డి కేసు నమోదు చేశారు.
వడదెబ్బతో మరొకరు..
భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలోని ఏఎస్‌ఆర్ కాలనీకి చెందిన మల్లేష్(50) శనివారం ఉదయం వడదెబ్బతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, భద్రాచలం టౌన్ ఏఎస్‌ఐ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. రోజువారి కూలీగా పనిచేసే మల్లేష్ శుక్రవారం ఉదయం 8 గంటలకు కాంట్రాక్ట్ కూలీ పనికి వెళ్లి సాయంత్రం 5.30 గంటలకు ఇంటికి తిరిగివచ్చాడు. రాత్రి భోజనం చేసి పడుకున్నాక అర్ధరాత్రి సమయాన వాంతులు, విరోచనాల అయ్యాయి. అనంతరం నిద్రపోయిన మల్లేష్ తిరిగి 13వ తేదీ ఉదయం సృహతప్పినట్లు కనిపించడంతో కుటుంబాలకులు వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి భార్య గురవమ్మ ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ కేసు నమోదు చేశారు.
చికిత్స పొందుతున్న వ్యక్తి ..
రఘునాథపాలెం: భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో ఎలుకల మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. రఘునాథపాలెం మండలం కేసీఆర్ కాలనీకి చెందిన కొరదాల గోపి(29) కూలీ పనులతో జీవనం సాగిస్తున్నాడు. అయితే, గోపి దంపతుల నడుమ మనస్పర్థలతో ఆయన భార్య ఏడాది కాలంగా విజయవాడలోని పుట్టింట్లో కుమారుడితో ఉంటోంది. ఏడాది దాటినా భార్య కాపురానికి రాకపోవడంతో మనస్థాపం చెందిన గోపి ఈనెల 3వ తేదీన ఎలుకల మందు తాగగా కుటుంబీకులు ఆస్పత్రిలో చేర్పించడంతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఘటనపై ఆయన తండ్రి మైసయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ ఉసా్‌మ్‌న్ షరీఫ్ తెలిపారు.
ద్విచక్రవాహనాన్ని
ఢీకొట్టిన ట్యాంకర్..
ముగ్గురికి గాయాలు, కేసు నమోదు
అశ్వారావుపేటరూరల్: ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఓ ట్యాంకర్ ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానిక ఎస్‌ఐ టి.యయాతీ రాజు కథనం ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా జీలుగుమి ల్లి మండలం దర్భగూడేనికి చెందిన దారబోయిన శ్రీను, సోమ వెంకన్నబాబు, గౌతమ్‌లు ద్విచక్రవాహనంపై అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం గ్రా మానికి శుక్రవారం వచ్చి అదే రోజు రాత్రి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళ్తున్న ట్యాంకర్ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా, మెరుగైన వైద్యం కోసం ఏలూరు ఆస్పత్రికి తరలించారు. కాగా, ట్యాంకర్ డ్రైవర్ రామ్‌చరణ్‌సింగ్(మధ్యప్రదేశ్) ఘటన స్థలంలో ఆగకుండా పారిపోతు న్న క్రమంలో పేటమాలపల్లి వద్ద పోలీసులు వెంబడించి పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
200 కేజీల గంజాయి స్వాధీనం?
కొణిజర్ల: కొణిజర్ల మండలం పల్లిపాడు సమీపాన మామిడికాయల లోడు పేరిట లారీలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు, ఈగిల్ ఫోర్స్ సభ్యులు శనివారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈక్రమాన సుమారు 200 కేజీల గంజాయి పట్టుకున్నట్లు సమాచారం. ఒడిషా రాష్ట్రం నుంచి గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో తనిఖీ చేపట్టగా.. పైన మామిడికాయలు లోడ్ చేసి వాటి కింద ట్రేలలో గంజాయి తీసుకెళ్తున్నట్లు గుర్తించారని తెలిసింది.


