కొత్తగా సర్క్యులర్ జారీ చేసిన
సింగరేణి యాజమాన్యం?
ఇష్టారాజ్యంగా పొందిన
పోస్టింగ్‌లకు చెక్ పెట్టే చర్యలు
అండర్‌గ్రౌండ్‌లో విధుల పట్ల
కొత్తవారిలో విముఖత
‘సర్ఫేస్’కు వస్తే లాభాల బోనస్,
పీఎల్‌బీలలో కోత ?
లైట్ జాబే కావాలి..
3 వేల మందికి పైగా
సింగరేణిలో క్రమపద్ధతి లేకుండా ఇష్టారీతిగా అమలవుతున్న డిప్యూటేషన్లపై స్టేట్ ఆడిట్ కమిటీ సైతం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మరోవైపు భూగర్భ గనుల్లో పని చేస్తున్న కార్మికులు ఏళ్ల తరబడి కఠిన పరిస్థితుల మధ్య డ్యూటీలు చేస్తున్నారు. రాజకీయ పలుకుడి ఉన్న వారు ఇలా ఉద్యోగంలో చేరి అలా సర్ఫేస్‌లో లైట్ జాబ్స్‌కు మళ్లడం సైతం ఉద్యోగులు/కార్మికుల్లో అసంతృప్తికి కారణమవుతున్న వైనాన్ని సైతం సంస్థ గుర్తించింది. ప్రస్తుతం సింగరేణిలో మూడు వేల మంది కార్మికులు/ఉద్యోగులు డిప్యూటేషన్ల పేరుతో లైట్ జాబ్‌లలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో 600 మందికి పైగా కనీసం టైం ఫ్రేమ్ లేకుండా లైట్ జాబ్‌లలో ఉన్నట్టుగా సంస్థ గుర్తించింది. దీంతో డిప్యూటేషన్ల క్రమబద్ధీకరించాలనే నిర్ణయానికి యాజమాన్యం వచ్చినట్టు సమాచారం. ఈ మేరకు డిప్యూటేషన్ల విషయంలో కచ్చితమైన నిబంధనలతో కూడిన సర్క్యులర్ జారీ చేసినట్టు తెలుస్తోంది.
ఇకపై ఆరు నెలలే..
సింగరేణి సంస్థ పరిధిలో ఒకే ఏరియా పరిధిలో, వివిధ ఏరియాల మధ్య , సంస్థకు ఆవల ఇలా మూడు పద్ధతుల్లో డిప్యూటేషన్లు కొనసాగుతున్నాయి. వీటికి నిర్ణీత కాల పరిమితి కూడా లేదు. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి రాబోయే మార్పుల్లో భాగంగా.. పరిపాలన సౌలభ్యం దృష్ట్యా ఒకే ఏరియా పరిధిలో డిప్యూటేషన్ ఇచ్చే అధికారం ఆ ఏరియా జనరల్ మేనేజర్‌కు ఉంటుంది. అయితే, ఇది ఆరు నెలలకు మించి ఉండకూడదు. ఆరు నెలల సమయం మించితే, కార్పొరేట్ కార్యాలయంలో డైరెకర్ట్ పా నుంచి అనుమతి తీసుకునేలా మార్పులు చేశారు. ఇక సంస్థ పరిధిలో వివిధ ఏరియాల మధ్య డిప్యూటేషన్లు జరగాలంటే డైరెక్టర్ పా అనుమతి ఉండాల్సిందే. ఈ డిప్యూటేషన్ల కనిష్ట గడువు ఆరు నెలలు ఉండగా, గరిష్ట పరిమితి ఏడాది వరకే అనే విధంగా నిబంధనలు రూపొందించినట్టు తెలుస్తోంది. ఇక సంస్థ ఆవల డిప్యూటేషన్ కావాలంటే సీఎండీ అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. సింగరేణిలో ఉన్నత స్థాయిలో సుమారు వంద మందికి పైగా ఉద్యోగులు డిప్యూటేషన్ల పేరుతో హైదరాబాద్‌లో పని చేస్తున్నట్టుగా ఆడిట్ లెక్కలు చెబుతున్నాయి. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే లెక్కాపత్రం లేకుండా కొనసాగుతున్న డిప్యూటేషన్లకు చెక్ పడే అవకాశం ఉంది. సంస్థలో కార్మికులు/ఉద్యోగులకు జీతభత్యాలతోపాటు అదనంగా అందించే పెర్ఫార్మెన్స్ లింక్‌డ్ ఇన్సెంటివ్, లాభాల బోనస్ వంటి ఆర్థిక ప్రయోజనాల విషయంలోనూ కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్టు తెలుస్తోంది.
అస్తవ్యస్తంగా మారిన డిప్యూటేషన్లపై సింగరేణి సంస్థ దృష్టి సారించింది. రాజకీయ అండదండలు, ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని డిప్యూటేషన్ ద్వారా తేలికపాటి జాబ్‌లలో కొనసాగే ఉద్యోగులు/కార్మికుల విషయంలో చూసీ చూడకుండా ఉండబోమనే సంకేతాలు పంపేందుకు యాజమాన్యం సిద్ధమైనట్టు సమాచారం. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
ఒకప్పుడు సింగరేణిలో ఉద్యోగం అంటే భూగ ర్భ గనుల్లోకి దిగి అత్యంత కఠినమైన పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి పని చేయాల్సి ఉండేది. లాంగ్‌వాల్, ఎస్‌డీఎల్, కంట్యిన్యూస్ మైనర్ తదితర ఆధునిక యంత్రాలు వచ్చాక భూగర్భ గనుల్లో సైతం బొగ్గు వెలికితీత సులభంగా మారింది. ఇరవై, ముప్పై ఏళ్ల క్రితం బ్లాస్టింగులు, తట్టా, చెమ్మాస్, లాడీస్ ఇలా అన్ని పనుల్లో కార్మికులు ఎంతో చెమటోడ్చితే కానీ బొగ్గు బయటకు వచ్చేది కాదు. ఇప్పుడా పరిస్థితి లేదు. అయినా కొత్తగా సంస్థలోకి వస్తున్న ఉద్యోగులు/కార్మికుల్లో చాలా మంది భూగర్భ గనుల్లో పనులకు సుముఖంగా లేరు. మెడికల్ బోర్డు ద్వారా సింగరేణిలో ఉద్యోగం పొందిన వారు, ప్రొబేషనరీ పీరియడ్ ముగిశాక భూగర్భ గనుల నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తున్నారు. తమకు తెలిసిన ఉన్నతాధికారుల ద్వారా పైరవీలు మొదలుపెడుతున్నారు. ఫలితంగా సర్ఫేస్ (ఉపరితలం) విభాగంలో ఉద్యోగులు/కార్మికుల సంఖ్య అవసరానికి మించి ఉంది.


