ఆసక్తి ఉన్న రైతులకు సహకారం
‘ఉపాధి హామీ’ ద్వారా పండ్ల తోటల సాగు
● రైతులకు మొక్కలు, ఎరువుల సరఫరా, ఇతర ఖర్చులు చెల్లింపు ● జాబ్ కార్డు ఉన్న వారందరూ అర్హులే ● ఖమ్మం జిల్లాలో 1,100 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు లక్ష్యం
రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపునకు మళ్లించడమే కాక వారి ఆదాయం, జీవనోపాధి పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఉద్యానవన పంటల సాగుకు ప్రోత్సాహం అందించనుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఉద్యానవన పంటల సాగుకు ఊతమివ్వాలని నిర్ణయించింది. ఉపాధి పథకంలో జాబ్‌కార్డులు కలిగి, ఐదెకరాల లోపు భూమి ఉన్న వారు ఉన్న రైతులను అర్హులుగా నిర్దేశించారు. ఖమ్మం జిల్లాలో 1,100 ఎకరాల్లో ఈ ఏడాది పండ్ల తోటల పెంపకం చేపట్టేలా ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
– సాక్షి ప్రతినిధి, ఖమ్మం
పండ్ల తోటలకు ఊతం
పండ్ల తోటలు సాగు చేయాలనుకునే రైతులకు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద సాయం అందించనుంది. ఇందులో భాగంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి శాఖల ఆధ్వర్యాన నిర్వహించే పథకానికి జిల్లాలో శ్రీకారం చుడుతున్నారు. గ్రామపంచాయతీల వారీగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి భూవిస్తీర్ణంలో 20 శాతం మేర మొక్కల పెంపకం, ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సహించనున్నారు.
మండలానికి 50 ఎకరాలు
ప్రస్తుత వానాకాలం సీజన్‌లో ఖమ్మం జిల్లాలో 1,100 ఎకరాల్లో ఉద్యానవన పంటల సాగు చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రతీ మండలంలో 50 ఎకరాలకు తక్కువ కాకుండా పంటల సాగు చేయించాలని నిర్దేశించారు. ఇందుకోసం ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డులు ఉన్న సన్న, చిన్నకారు రైతులను ఎంపిక చేసి ప్రభుత్వం నుంచి సహాయ, సహకారాలు అందిస్తారు. ఇప్పటికే కొన్ని చోట్ల రైతులు ఈ పంటల సాగుపై ఆసక్తి చూపుతుండగా, ప్రభుత్వ ప్రోత్సాహంతో రానున్న ఏడాది మరింత మంది ఆసక్తి చూపుతారనే భావన వ్యక్తమవుతోంది.
మూడేళ్లపాటు ఆసరా
ఐదెకరాల లోపు వ్యవసాయ భూములు కలిగిన ఎస్సీ, ఎస్టీలతోపాటు ఇతర వర్గాల రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. జామ, నిమ్మ, దానిమ్మ, కొబ్బరి, మామిడి, జీడిమామిడి, వెదురు, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్, ఆయిల్ పామ్, సపోటా, బత్తాయి, అల్లనేరేడు మొక్కలను అధికారులే పంపిణీ చేస్తారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల పాటు చేయూత ఇవ్వనుంది. మట్టి నమూనా సేకరణ, పరీక్ష, మొక్కలు నాటేలా గుంతలు తీయడం, నాటడం, వంగిపోకుండా కర్రలు కట్టడం, సంరక్షణ, ఎరువులు తదితర ఖర్చులన్నీ ప్రభుత్వమే అందిస్తుంది.
డిమాండ్ ఆధారంగా..
సీజన్ వారీగా లభించే పండ్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అయితే, ఇవి జిల్లాలో లభ్యత లేక ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసకుంటున్నారు. ఈనేపథ్యాన ఉపాధి హమీ పథకం కింద ప్రోత్సహించనుండడంతో జిల్లాలో ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెరుగుతుందని భావిస్తున్నారు. తద్వారా రైతులకు దీర్ఘకాల జీవనోపాధి, సుస్థిర ఆదాయం, వినియోగదారులకు నాణ్యమైన పండ్లు చౌక ధరలో లభిస్తాయి.
జిల్లాలోని చిన్న, సన్నకారు రైతులు ఉద్యాన పంటలను సాగు చేసేలా ఉపాధి హామీ పథకం ద్వారా సహకారం అందిస్తాం. అవసరమైన మొక్కలు నాటేందుకు అయ్యే ఖర్చు, మూడేళ్లపాటు నిర్వహణ ఖర్చులు కూడా అందుతాయి. ఉపాధి కూలీల ద్వారా ఈ పనులు చేయిస్తాం. జాబ్‌కార్డు కలిగిన చిన్న, సన్నకారు రైతులు ఉద్యాన పంటల సాగుకు దరఖాస్తు చేసుకుంటే జిల్లాకు కేటాయించిన లక్ష్యం ఆధారంగా అవకాశం కల్పిస్తాం.
– కొండపల్లి శ్రీరామ్, ఖమ్మం డీఆర్‌డీఓ


