దమ్మపేట/అశ్వారావుపేటరూరల్: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో పర్యటించనున్నారు. దమ్మపేట మండలంలోని పూసుకుంట, పట్వారిగూడెం, మొద్దులగూడెం, నాయుడుపేట గ్రామాల్లో నిర్మాణం పూర్తిచేసుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం, బీటీ రోడ్లకు శంకుస్థాపన తదితర కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అశ్వారావుపేటలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన చేయనున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేయడంతోపాటు పబ్లిక్ అర్బన్ పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేపట్టనున్నారు. కాగా, మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించినట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు తెలిపారు.
ముత్తంగి అలంకరణలో రామయ్య
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
సికిల్ సెల్ అనీమియా కేసులను గుర్తించాలి
చుంచుపల్లి: జిల్లాలో సికిల్ సెల్ అనీమియా, హైపోతలసేమియా కేసులను గుర్తించాలని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ విజయలక్ష్మి అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో సికిల్ సెల్ అనీమియా, హైపోథలసేమియా నియంత్రణలపై సోమవా రం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధితుల గుర్తింపు, నివారణపై దృష్టి సారించాలని సూచించా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం గర్భిణులకు, వారి భర్తలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇద్దరికీ పాజిటివ్‌గా తేలితే గర్భస్థ శిశువుకు కూడా తగిన పరీక్షలు చేయాలన్నారు. పుట్టిన బిడ్డకు 48 గంటల తర్వాత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రామవరం యూపీహెచ్‌సీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌ఓ తుకా రాం రాథోడ్, ఇతర అధికారులు ప్రతాప్, రాకేష్, హరీష్, దినేష్, నాగలక్ష్మి పాల్గొన్నారు.
ప్రతీ న్యాయమైన
సమస్య పరిష్కరిస్తాం
ఖమ్మంరూరల్: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారం చూపించడమే ప్రజాదర్బార్ కార్యక్రమం లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో కలెక్టర్ దివాకర టీ.ఎస్.తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గాన్ని 14 క్లస్టర్లగా విభజించి ప్రజాదర్బార్లు నిర్వహిస్తున్నామన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో చివరి ప్రజాదర్బార్ జరగగా 3,500 దరఖాస్తులకు వచ్చాయని తెలిపారు. వీటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిష్కరించేలా అధికారులకు సూచనలు చేశామని చెప్పారు. మొత్తం ప్రజా దర్బార్లలో అందిన 21,536 దరఖాస్తుల్లో అత్యధికంగా 9,731 దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్ల కోసమే వచ్చాయని తెలిపారు. ఇక పెన్షన్ల కోసం 4,700, భూ సమస్యలకు 4వేలు, గృహజ్యోతి పథకం కోసం 900 దరఖాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


