ఈ ఏడాది టన్ను ధర
పెరుగుదల (రూ.లలో)..
అశ్వారావుపేటరూరల్: పెరుగుతున్న పామాయిల్ గెలల ధర రైతుల్లో ఉత్సాహం నింపుతోంది. గత నెలలో టన్ను ధర రూ.23,501కు చేరుకోగా, ఈ నెలలో రూ.23,852కు పెరిగింది. టన్నుకు తాజాగా మరో రూ.351 పెరిగి ఆయిల్‌ఫెడ్ చరిత్రలోనే ఆల్‌టైం రికార్డు సృష్టించింది. అశ్వారావుపేట, దమ్మపేట మండలంలోని అప్పారావుపేటలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలు ఏర్పాటైన తర్వాత అత్యధిక ధర ఇదే కావ డం విశేషం. కరోనా సమయం, 2022వ సంవత్సరంలో అత్యధికంగా టన్నుకు రూ.23,467 గరిష్టంగా నమోదైంది. కరోనా సమయం తర్వాత మళ్లీ ఈ ఏడాదిలోనే రూ.23వేల మార్క్ దాటింది. దీంతో ఆయిల్‌పామ్ సాగుదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కొత్త ఏడాది ఆరంభం నుంచే ధరలో పెరుగుదల కనిపించగా, ఆరు నెలలుగా పెరుగుతూనే ఉంది. దీంతో మరికొందరు రైతులు పామాయిల్ తోటల సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు.
కౌలుదారులపై భారమే..
ఆయిల్‌పామ్ తోటలను కౌలు తీసుకుని సాగు చేసే రైతులపై ధరల భారం పడుతోంది. గతేడాది ఎక రం ఆయిల్‌పామ్ తోట కౌలు రూ.45 వేల నుంచి అత్యధికంగా రూ.70 వేలుగా ఉంది. ఈ ఏడాది పామాయిల్ గెలల టన్ను ధర పెరుగుదల, ధర తగ్గకపోవడంతో సాగుదారులు ఒకేసారి కౌలు ధరలు పెంచేశారు. గడిచిన కొద్ది నెలలుగా జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో ఎకరం కౌలు ఏకంగా రూ.లక్ష దాటింది. జిల్లాలోని మిగి లిన ప్రాంతాల్లో ఎకరం కౌలు ధరలు కొంతమేర ఆశాజనకంగానే ఉండగా, ఈ రెండు మండలాల్లోనే కౌలు ధర ఆందోళన కలిగిస్తోంది. భారీగా పెరిగిన కౌలు ధరలతో చిన్న, సన్నకారు రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
నెల ధర
జనవరి 19,694
ఫిబ్రవరి 20,456
మార్చి 21,546
ఏప్రిల్ 23,005
మే 23,501
జూన్ 23,852


