సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ అంకిత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతితో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తును బాధ్యతాయుతంగా పరిశీలించి, వేగవంతంగా పరిష్కరించాలన్నారు.
దరఖాస్తుల్లో కొన్ని ఇలా..
● కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ వనమా కాలనీలో నివాసముంటున్న విజయలక్ష్మి తమకు ఇంటి నిర్మాణ స్థలం ఉన్నప్పటికీ ఆర్థిక స్థోమత లేక ఇల్లు నిర్మించుకోలేకపోతున్నామని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ గృహనిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌కు ఎండార్స్ చేశారు.
● ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో నివాసముంటున్న కొండపల్లి ఉమ తన కుమెర్తా అనారోగ్యం కారణంగా గురుకుల కళాశాల ప్రవేశ పరీక్షకు హాజరు కాలేకపోయిందని, తమ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని సీటు కేటాయించాలని కోరుతూ చేసిన దరఖాస్తును ఆర్‌సీఓకు ఎండార్స్ చేశారు.
● దుమ్ముగూడెం మండలం కోయ నర్సాపురం ఆదివాసీ రైతులు 116 మంది తాము తరతరాలుగా సాగు చేసుకుంటున్న సుమారు 250 ఎకరాల భూమికి పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేయగా, దుమ్ముగూడెం తహసీల్దార్‌కు ఎండార్స్ చేశారు.
● అశ్వాపురం మండలానికి చెందిన కోడి నాగరాజు రోడ్డు ప్రమాదంలో ఎడమ చేయిని కోల్పోయానని, డిగ్రీ చదివిన తనకు ప్రభుత్వ కార్యాలయంలో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగావకాశం కల్పించాలని కోరగా, జిల్లా ఉపాధి కల్ప నాధికారికి ఎండార్స్ చేశారు.
● కొత్తగూడెం ఆర్‌డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆర్‌డీఓ మధుకు పది మంది అర్జీలు అందించారు.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం దర్బార్‌కు రావొద్దు
భద్రాచలం: గిరిజన దర్బార్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తులను సమర్పించొద్దని, కేవలం స్వయం ఉపాధి పథకాలకు మాత్రమే అందజేయాలని ఐటీడీఏ ఏపీఓ డేవిడ్ రాజ్ అన్నా రు. సోమవారం ఐటీడీఏలో నిర్వహించిన గిరి జన దర్బార్‌లో ఆయన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో ఉన్నతాఽధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అధికారులు ఆనంద్ కుమార్, మధుకర్, రాంబాబు, వేణు, ఉదయ్‌కుమార్, గన్యా, మణిధర్ పాల్గొన్నారు.
ప్రజావాణిలో కలెక్టర్ అంకిత్


