ఇద్దరు యువతులకు తీవ్రగాయాలు
బూర్గంపాడు: మండల పరిధిలోని మర్రికుంట గ్రామం వద్ద జాతీయ రహదారిపై సోమవా రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువతులకు తీవ్రగాయాలయ్యాయి. మర్రికుంట నుంచి పాల్వంచ వైపు స్కూటీపై వెళ్తున్న పాల్వంచ మండలం సూరారం గ్రామానికి చెందిన వైష్ణవి, శ్రీవల్లిని ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో శ్రీవల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వైష్ణవి, శ్రీవల్లిలు మర్రికుంట గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
5 మెట్రిక్ టన్నుల చేపలు మృతి
జూలూరుపాడు: మండలంలోని భోజ్యాతండా గ్రామ పంచాయతీ దండేల చెరువులో సోమవారం సుమారు 5 మెట్రిక్ టన్నుల చేపలు మృతి చెందాయి. ఎండ తీవ్రతతో చెరువులో నీటి నిల్వ తగ్గి, నీటిలో ఆక్సిజన్ కొరతతో చేపలు మృత్యువాత పడ్డాయని మత్స్య సహకారం సంఘం సభ్యులు తెలిపారు. సుమారు రూ.6లక్షల వరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదికాలంగా చేపల పెంపకం చేపట్టామని, మృగశిర కార్తె సందర్భంగా చేపల అమ్ముకోవచ్చని భావించామని, సోమవారం ఉదయం చెరువు వద్దకు రాగానే చేపలు చనిపోయి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కాగా, మృతి చెందిన చేపలతో చెరువు కలుషితం కాకుండా జేసీబీతో గొయ్యి తవ్వించి పూడ్చివేసినట్లు సర్పంచ్ లావుడ్యా ద్వాలీ తెలిపారు.


