పాల్వంచ: నవ లిమిటెడ్ సంస్థ కార్మిక సమస్యలను పూర్తిగా విస్మరిస్తోందని, సమస్యలపై బహిరంగ చర్చకు రావాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్, సీఐటీయు సీనియర్ నాయకుడు ఎంవీ అప్పారావు డిమాండ్ చేశారు. సోమవారం కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో నవలిమిటెడ్ సంస్థ గేటు ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కర్మాగారంలో అనేక విభాగాల్లో కాంట్రాక్ట్ కార్మికులు 5 నుంచి 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నా యాజమాన్యం కనీస వేతనాలు అమలు చేయడం లేదని ఆరోపించారు. కార్మికులకు పని భద్రత, బీమా సౌకర్యం, గ్రాట్యూ టీ లేవని, తీవ్రమైన వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నవభారత్‌లో మహిళా ఉద్యోగుల నియామకాలు లేవని, ఫెర్రో ఎల్లాయిస్‌లో 12/3 అగ్రిమెంట్ ప్రకారం 55 మంది కార్మికులు ఉండాల్సి ఉండగా, 47 మంది మాత్రమే ఉన్నారని అన్నారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని నాయకులతో మాట్లాడి ఆందోళన విరమింప జేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు దొడ్డా రవికుమార్, పి.తులసీరాం, కె.సత్య, వి.సత్యవాణి, వింజా రాములు, ఎస్‌కె.నిరంజన్, బి.కాంతి, గోపాల్, సుధీర్, సురేష్, యాకోబు పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి
ఏజే రమేష్


