అతి నమ్మకం అనర్థం
సత్తుపల్లి టౌన్: సిరిపురం గ్రామంలో గౌతమ్ అనే విద్యార్థి ఉండేవాడు. ఏ పనినైనా ఇట్టే చేసేయగలనని ఆయనకు అతి నమ్మకం ఉండేది. కానీ ఆ నమ్మకంతోనే ఎందులోనూ రాణించలేకపోయేవాడు. ఒకరోజు గౌతమ్ వాళ్ల వ్యాయామ ఉపాధ్యాయుడు వారం రోజుల్లో రామాపురం అనే గ్రామంలో ఆటలు పోటీలు ఉన్నాయి. అందరూ బాగా సాధన చేయండి అని సూచించాడు. మిగతా పిల్లలందరూ సార్ చెప్పినట్టుగా సాధన చేయసాగారు. కానీ గౌతమ్ మాత్రం తనకు అన్నీ వచ్చనే అతి నమ్మకంతో ఉన్నాడు. సైకిల్ తొక్కుతూ రోడ్లమీద తిరుగుతూ వృథాగా కాలక్షేపం చేయసాగాడు. అటు ఉపాధ్యాయుడు, ఇటు స్నేహితులు ఎంత చెప్పినా వినలేదు. ఇంతలో పోటీల రోజు రానే వచ్చింది. అందరూ రామాపురం వెళ్లారు.
అందరూ దూరం కావడంతో..
రామాపురంలో జరిగిన పోటీల్లో మొదటి రెండు ఆటల్లో గౌతమ్‌ను తీసుకోలేదు. మూడో ఆటలో ఆయనను తీసుకున్నా ఆయన ఆటతీరు సరిగ్గా లేక ఓడిపోయారు. దీంతో స్నేహితులంతా గౌతమ్ వల్లే ఓడిపోయామని తిట్టారు. సార్ కూడా కోపడ్డాడు. దీంతో ఆయన బాధపడుతూ సైకిల్ మీద ఇంటికి బయలు దేరాడు. అదే విషయం ఆలోచిస్తూ వెళ్తుండడంతో సైకిల్‌తో ఆగి ఉన్న లారీని ఢీకొట్టగా కాళ్లు, చేతులకి బాగా దెబ్బలు తగిలాయి. చుట్టుపక్కల వాళ్లు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. కొన్నాళ్లపాటు పాఠశాల, స్నేహితులకు దూరమయ్యాడు. అప్పుడు గౌతమ్ ‘అతి నమ్మకం వల్లే కదా ఈ పరిస్థితి వచ్చింది’అని తెలుసుకుఇ బాధపడ్డాడు. ఒక సంవత్సరం తర్వాత పాఠశాలకు వెళ్లిన గౌతమ్ వ్యాయామ ఉపాధ్యాయుడి వద్దకు వెళ్లి ‘నేను మళ్లీ ఆటలు ఆడుతాను సార్. ఇప్పటినుంచి బాగా సాధన చేస్తాను. మీరు చెప్పినట్లు నడుచుకుంటాను’అని చెప్పాడు. అందుకు అనుగుణంగానే బాగా సాధన చేసి మంచి క్రీడాకారుడుగా ఎదిగాడు.
నీతి : నమ్మకం ఉండడం తప్పు కాదు కానీ అతి నమ్మకం ఉండకూడదు. అతి నమ్మకం అహంకారానికి, ఆ అహంకారం పతనానికి దారి తీస్తుంది.


