పాల్వంచరూరల్: పాల్వంచ రేంజ్ పరిధిలోని పాండురంగాపురం గ్రామ శివారులో రిజర్వ్ ఫారెస్ట్‌లో కొట్టిన చెట్లు, అర్బన్‌పార్కులో జరిగిన అవకతవకలపై ఫారె స్ట్ విజిలెన్స్ డీఎఫ్‌ఓ శివయ్య, రేంజర్ అఫ్రొజ్ సోమవారం విచారణ చేపట్టారు. మంగళవారం విచారణ కొనసాగనున్నట్లు సమాచారం. ఈ విషయమై రేంజర్ ప్రసాద్‌ను వివరణ కోరగా.. ఫారెస్ట్ విజిలెన్స్ డీఎఫ్‌ఓ పాండురంగాపురం శివారులో విచారణ చేశారని తెలిపారు. గత నెల 30న నారవేప చెట్టు నరకగా, కేసు కూడా నమోదు చేశామని పేర్కొన్నారు.
విద్యుత్ మోటార్ చోరీ
అశ్వాపురం: మండల పరిధిలోని మల్లెలమడుగు గ్రామం రాళ్లవాగు సమీపంలో రైతు స్వర్గం చంద్ర య్య పొలంలో విద్యుత్ మోటార్‌ను ఆదివారం రాత్రి చోరీ చేశారు. ఉదయం రైతు పొలం వద్దకు వెళ్లి చూడగా చోరీ విషయం వెలుగుచూసింది. ఇటీవల ఈ ప్రాంతంలో తరచూ విద్యుత్ మోటార్లు, మోటార్ల వైరు చోరీలతో రైతులు భయాందోళన చెందుతున్నారు. పోలీసులు చోరీలపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.
ఉరి వేసుకుని
యువకుడి ఆత్మహత్య
నేలకొండపల్లి: మండలంలోని అజయ్‌తండాకు చెందిన బానోత్ గోపి(24) ఆదివారం అర్ధరాత్రి తన ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు సీపీఆర్ చేసినా ఫలితం లేక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేసరికి అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యాన ఆమె వేధింపులు భరించలేక గోపి ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన తల్లి జయమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
వివాహిత అదృశ్యంపై కేసు
మండలంలోని ఆజయ్‌తండాకు చెందిన ఓ వివాహిత కానరావడం లేదని ఆమె కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. ఆమె ఆదివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోగా.. ఎక్కడ వెతికినా ఫలితం లేకపోవడంతో ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


