ఏటా లక్షల సంఖ్యలో
మొక్కలు నాటుతున్న అధికారులు
నాటిన మొక్కలకు, బతికిన
మొక్కలకు కుదరని పొంతన
మరోసారి వనమహోత్సవానికి
సిద్ధమవుతున్న అధికారులు
గత లెక్కలు, లోపాలు తేలితేనే
భవిష్యత్‌లో పకడ్బందీగా అమలు
ముందు నడవాల్సింది భద్రాద్రినే..
హరితహారం వనమహోత్సవంగా..
రాష్ట్రవ్యాప్తంగా అడవులు, పచ్చదనం పెంచే లక్ష్యంతో తెలంగాణ ఏర్పాటు నుంచీ ఏటా వానాకాలంలో లక్షలాది మొక్కలు నాటుతున్నారు. గత ప్రభుత్వం హరితహారం నిర్వహించగా, ప్రస్తుత ప్రభుత్వం అదే కార్యక్రమాన్ని వనమహోత్సవంగా చేపడుతోంది. ఈ ఏడాది సైతం జిల్లా వ్యాప్తంగా 55.40 లక్షల మొక్కలు నాటాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే, నాటుతున్న మొక్కలకు బతికి ఉన్న మొక్కలకు మధ్య పొంతన లేదనే విమర్శలు ఆది నుంచి ఉన్నాయి. అందువల్లే హరిత హారం కాస్తా వనమహోత్సవంగా మారింది. పేరు మారింది తప్పా క్షేత్రస్థాయిలో మొక్కలు నాటే తీరు, సంరక్షణలో మార్పులు రాలేదు. ఎక్కడ లోపం జరుగుతోందనే అంశాన్ని తెలుసుకోవాలని గతేడాది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొత్తగూడెంలో ప్రత్యేకంగా సూచనలు చేశారు.
పైలట్ ప్రాజెక్ట్ చేపట్టి లోపాలు గుర్తించాలి
గతేడాది జూలై 27న ఇన్‌చార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి అధ్యక్షతన ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో అమలువుతున్న ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడిగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ ‘హరిత హారం పేరుతో విరివిగా మొక్కలు నాటామని గత ప్రభుత్వం చెప్పుకుంది. ఇప్పుడు కూడా మీరు వేల సంఖ్యలో మొక్కలు నాటబోతున్నట్టు చెబుతున్నారు. కాగితాల్లో కనిపించే లెక్కలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు మధ్య పొంతనే లేదు. ఉమ్మడి జిల్లాలో ఒక మేజర్ పంచాయతీని యూనిట్‌గా తీసుకుని పైలట్ ప్రాజెక్ట్‌గా.. గడిచిన పదేళ్లలో నాటిన మొక్కలు, చేసిన ఖర్చు, ఇప్పటి వరకు బతికున్న మొక్కలు తదితర వివరాలు సేకరించాలి. అప్పుడు ఈ కార్యక్రమంలో లోటుపాట్లు తెలుస్తాయి. వచ్చే ఫలితాలను అనుసరించి రాబోయే రోజుల్లో వనమహోత్సవం కార్యక్రమాన్ని లోపరహితంగా అమలు చేయవచ్చు.’అని సూచించారు. ఫారెస్ట్ శాఖతో పాటు రెండు జిల్లాల అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.
ఎండలు తగ్గుముఖం పడుతున్నాయి. వానలు నెమ్మదిగా జోరందుకోనున్నాయి. ఈ క్రమంలోనే పచ్చదనం పెంచేందుకు వన మహోత్సవం నిర్వహించేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. అయితే, ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరింత సమర్థంగా అమలు చేసేలా మార్గ్గదర్శిగా నిలవాల్సిన బాధ్యత భద్రాద్రి జిల్లాపైనే ఉంది.
– సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
కొద్ది రోజుల్లో నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత రెండు మూడు భారీ వర్షాలు పడ్డాక వన మహోత్సవం నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ క్రమంలో వన మహోత్సవం జరిపేందుకు ఇంకా మూడు, నాలుగు వారాల సమయం ఉంది. ఇప్పటికై నా లోపం ఎక్కడుందో గుర్తించేందుకు డిప్యూటీ సీఎం భట్టి సూచనలకు తగ్గట్టుగా భద్రాద్రి కొత్తగూడెం లేదా ఖమ్మం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాల్సిన అవసరం ఉంది. లోపాలను సవరిస్తే మెరుగైన ఫలితాలు పొందేందుకు ఆస్కారం ఉంటుంది. రాష్ట్రంలోనే అత్యధికంగా అడవులు ఉన్న జిల్లాగా భద్రాద్రి కొత్తగూడేనికి గుర్తింపు ఉంది. అదే తరహాలో వన మహోత్సవాన్ని మరింత సమర్థంగా అమలు చేసే బాధ్యతను అధికారులు తీసుకోవాల్సి ఉంది.


