సన్నాలు తక్కువగా విక్రయించారు
యాసంగిలో ధాన్యం కొనుగోళ్ల వివరాలు
● యాసంగిలో సన్నాలు ప్రైవేటు మార్కెట్‌లో విక్రయం ● దొడ్డు రకం ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మకం ● లక్ష్యం 48 వేల మెట్రిక్ టన్నులు.. సేకరణ 40 వేల ఎంటీ ● 4,724 మంది రైతుల ఖాతాల్లో రూ.88 కోట్లు జమ
పాల్వంచరూరల్: ప్రభుత్వ పట్టింపులేనితనం, రైతుల అవస్థల మధ్య ధాన్యం సేకరణ పూర్తయింది. యాసంగి సీజన్ వడ్ల కొనుగోళ్లు ఈ నెల 3వ తేదీతో ముగించారు. రైతులు సన్నరకం ధాన్యం ప్రైవేటు వ్యాపారులకు, దొడ్డురకం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. జిల్లాలో 89 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, లక్షా 87 వేల మెట్రిక్ టన్నుల(ఎంటీ) ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో 48 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా జిల్లా పౌరసరఫరాలశాఖ 167 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. 5,294 మంది రైతుల నుంచి రూ.96.45 కోట్ల విలువైన 40,670 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం కొన్నది. 4,724 మంది రైతుల ఖాతాల్లో రూ.88 కోట్లు జమ చేయగా, ఇంకా 570 మందికి సుమారు రూ.8.45 కోట్లు చెల్లించాల్సి ఉంది.
సన్నరకం ప్రైవేట్‌కు...
యాసంగిలో సన్నరకం ధాన్యం రైతులు ప్రైవేటు వ్యాపారులకే ఎక్కువగా విక్రయించారు. కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం ధాన్యం 5,342 మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం ధాన్యం 35.32 వేల మెట్రిక్ టన్నులు విక్రయించారు. గతేడాది యాసంగిలో 55,243 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, ఈసారి 40,670 మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారు. గతేడాది కంటే 15వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ తగ్గింది. ఈసారి బహిరంగ మార్కెట్‌లో సన్నాలకు అధిక డిమాండ్ ఉంది. దీనికితోడు గతేడాది యాసంగి ధాన్యానికి ప్రభుత్వం ఇప్పటివరకు బోనస్ ఇవ్వలేదు. అధిక డిమాండ్ ఉండటం, బోనస్ వస్తుందో, రాదో తెలియని పరిస్థితుల్లో రైతులు సన్నాలను ప్రైవేటు వ్యాపారులకు విక్రయించుకోవాల్సి వచ్చింది. దొడ్డు రకాలను మాత్రం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు.
యాసంగిలో సన్న రకాలకు బయట మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉండటంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించారు. ఈసారి యాసంగిలో రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేశాం. రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.88 కోట్లు జమ చేశాం. మిగిలిన రైతులకు రెండు రోజుల్లో నగదు జమ చేస్తాం.
–ఎస్.త్రినాథ్‌బాబు,
జిల్లా పౌరసరఫరాల కార్పొరేషన్ మేనేజర్
కొనుగోలు కేంద్రాలు ధాన్యం విలువ సేకరించిన ధాన్యం
(రూ. కోట్లలో) (మెట్రిక్ టన్నుల్లో)
సహకార సొసైటీ 93 66.36 27,986
ఐకేపీ 17 14.13 5,954
జీసీసీ 26 5.24 2,207
డీసీఎంఎస్ 31 10.72 4,522


